అమ్రాబాద్: ఎగువన వర్షాలకు శ్రీశైలం జలాశయం (Srisailam) పూర్తిగా నిండిపోయింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలానికి పర్యాటకుల సందడి పెరిగింది. డ్యాం గేట్ల నుంచి కిందికి దూకుతున్న కృష్ణమ్మను చూడటానికి ప్రజలు క్యూకడుతున్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాల బారినపడుతున్నారు. ప్రకృతి అందాలను వీక్షించడానికి వెళ్లిన ముగ్గురు యువకులు ఘాట్రోడ్డులో జరిగిన ప్రమాదంలో మరణించారు.
హైదరాబాద్లోని బొల్లారానికి చెందిన నలుగురు యువకులు కారులో శ్రీశైలం బయలుదేరారు. ఈ క్రమంలో శనివారం రాత్రి 12 గంటల సమయంలో అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని వటవర్లపల్లి వద్ద అదుపుతప్పిన కారు.. చెట్టును ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ముగ్గురు మృతిచెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సహాయంతో పోలీసులు అతడిని దోమలపెంట దవాఖానకు తరలించారు. కాగా, బాధితుల వివరాలు తెలియాల్సి ఉన్నది.