మైలార్‌దేవ్‌పల్లి, అక్టోబర్ 27: నిషేధిత గంజాయిని సేవిస్తున్న ముగ్గురిని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. రాజేంద్రనగర్ ఎస్ఓటీ, మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు ఆదివారం కాటేదాన్‌లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ముగ్గురు వ్యక్తులు గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి 200 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బహదూర్‌పురకు చెందిన షేక్ ముషరఫ్ యాసీన్ (23), కాటేదాన్‌కు చెందిన ఇజ్రాయెల్ అన్సారీ(20), మంజూర్ మహ్పూజ్ సయ్యద్(35) కాటేదాన్ ప్రాంతంలోని కూలీల అడ్డాలపై కూర్చొని గంజాయి సేవిస్తున్నారు. వీరిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా 200 గ్రాముల గంజాయి లభించింది. వీరు జార్ఖండ్ నుంచి గంజాయిని తీసుకువస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.