సిటీబ్యూరో: బోరబండ డివిజన్ మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ నేత బాబా ఫసీయుద్దీన్ తన కుమారుడిని బెదిరింపులకు గురిచేశాడంటూ స్థానిక బీఆర్ఎస్ నేత రియాజ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. శనివారం పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా బోరబండ సంక్షేమ సంఘం ఆఫీస్ సమీపంలో రోడ్డుమీద నిలబడిన బీఆర్ఎస్ నేత రియాజ్ వద్దకు తన అనుచరులతో వచ్చిన మాజీ కార్పొరేటర్ బాబా ఫసీ యుద్దీన్ బెదిరింపులకు దిగాడని, గత రెండేళ్లుగా తన కొడుకును బాబా ఫసీయుద్దీన్ వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితుడి తండ్రి ఫయాజ్ ఖాన్ బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా స్థానిక బీఆర్ఎస్ నేత రియాజ్ మీద బెదిరింపుల గురించి తెలుసుకున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి మాగంటి సునీతాగోపీనాథ్, డివిజన్ బీఆర్ఎస్ నేతలు కృష్ణమోహన్‌తో పాటు పలువురు నాయకులు శనివారం సాయంత్రం బోరబండ పీఎస్‌కు చేరుకున్నారు. గతంలో సైతం బీఆర్ఎస్ నేతలను వేధింపులకు గురిచేసిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బాబా ఫసీయుద్దీన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై తాము సమగ్ర విచారణ చేస్తామని, బోరబండ ఇన్స్పెక్టర్ హామీ ఇవ్వడంతో బీఆర్ఎస్ నాయకులు అక్కడి నుంచి వెనుదిరిగారు.