మారేడ్‌పల్లి, మార్చి 22 రాజీవ్ రహదారి విస్తరణలో భాగంగా 200 ఫీట్ల నుంచి 100 ఫీట్లకు రోడ్డును కుదించాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టిని శనివారం కార్యాలయంలో రాజీవ్ రహదారి ప్రాపర్టీస్స్ ఓనర్స్ జేఏసీ చైర్మన్ తేలుకుంట సతీష్ గుప్త సభ్యులు కలిసి వినతిపత్రం అందజేశారు. రెండు వందల ఫీట్ల రోడ్డు విస్తరణతో వేలాది కుటుంబాలు రోడ్డు పడే పరిస్థితి నెలకొందని,100 ఫీట్లకు కుదిస్తే బాగుంటుందని కలెక్టర్‌కు వివరించారు.
ఇప్పటికే రోడ్డు విస్తరణలో భాగంగా చాలా మంది కిరాయిదారులను, వ్యాపార సముదాయాలను ఖాళీ చేయించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా ఇంటి పన్ను పెంచడం చాలా బాధాకరని, పెంచిన పన్నులను వెంటనే తగ్గించాలని, రోడ్డు విస్తరణ పూర్తి అయ్యే వరకు ఇంటి పన్నులను వసూళ్లు చేయొద్దని కలెక్టర్‌ను కోరామని చైర్మన్ సతీష్ గుప్త తెలిపారు. అంతే కాకుండా విద్యుత్ అధికారులు ప్రతి ఒక్క భవనానికి ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని కలెక్టర్‌కు వివరించారు.
త్వరలో రోడ్డు విస్తరణ విషయం సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇంటి పన్ను, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల విషయంలో తక్షణమే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని కలెక్టర్ తెలిపినట్లు జేఏసీ చైర్మన్ సతీష్ గుప్త వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉప్పలంచ అమర్నాథ్, సూర్యప్రకాశ్‌రెడ్డి, మినిగాండ్ల శ్రీనివాస్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.