Ranganath Temple | రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పోలీస్ స్టేషన్ ఫరిధిలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సొంత గ్రామమైన తొర్రూర్లో ఉన్న ప్రసిద్ధ రంగనాథ స్వామి ఆలయంలో హుండీని ఎత్తుకెళ్లారు.
అర్ధరాత్రి సమయంలో ఆలయానికి చేరుకున్న గుర్తుతెలియని దుండగులు, దేవాలయ ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. గర్భాలయం వద్ద ఉన్న రెండు హుండీలను ఎత్తుకెళ్లారు. ఉదయం ఆలయానికి వచ్చిన అర్చకులు.. తలుపులు విరగొట్టి ఉండటం చూసి స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆలయానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలుసేకరించారు. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆలయంలోని, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.
ఈ ఆలయంలో దొంగతనం జరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం. వరుస చోరీలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పోలీసుల నిర్లక్ష్యం వల్లే దుండగులు పదే పదే రంగనాథ ఆలయాన్ని టార్గెట్ చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పటిష్టమైన బందోబస్తు నిర్వహించాలని సూచిస్తున్నారు.