ఖైరతాబాద్, అక్టోబర్ 6 : ఏడు పదుల వయస్సు ఆతడిది.. ఓ మహాకవి పేరిట స్మారక పరిషత్‌ను నిర్వహిస్తున్నాడు.. సమాజంలో వివిధ హోదాల్లో ఉన్న వారికి అడపాదడపా అవార్డులు ఇస్తుంటాడు…ఈ సారి ఏకంగా ఆ సంస్థ పేరిట నకిలీ గౌరవ డాక్టరేట్లను రూపొందించి పలువురికి అందించే క్రమంలో పోలీసులకు దొరికిపోయాడు. సైఫాబాద్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం…గుంటూరు జిల్లాకు చెందిన డాక్టర్ పెద్దీటి యోహాన్ (75) పద్మభూషణ్ గుర్రం జాషువా స్మారక కళాపరిషత్‌ను స్థాపించాడు. తద్వారా సాహితీరంగంలో సేవలందించిన పలువురికి గతంలో అవార్డులు, రివార్డులు అందజేశాడు.
అయితే తాజాగా ఆ రంగంలో ఏడుగురిని ఎంపిక చేసి కళాపరిషత్తో సభ్యత్వం తీసుకోవాలని, అందుకు కొంత ఖర్చవుతుందని చెప్పాడు. దీంతో ఆ ఏడుగురు రూ.7వేల నుంచి రూ.20వేల వరకు సమర్పించగా, సభ్యత్వం ఇచ్చాడు. అంతేకాకుండా వారికి గౌరవ డాక్టరేట్లను ఇస్తానని చెప్పాడు. రెండు రోజుల కిందట ఎంపిక చేసిన ఏడుగురికి రవీంద్రభారతి వేదికగా డాక్టరేట్లు ప్రదానం చేస్తున్నట్లు మెసేజ్ పంపించాడు. దీంతో సోమవారం రవీంద్రభారతిలో పెద్ద సెటప్ వేసి డాక్టరేట్ ప్రదానం చేసే క్రమంలో పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. యోహాన్ను అదుపులోకి తీసుకొని, అక్కడి నుంచి సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు.
డాక్టరేట్లు ఇవ్వకూడదా….
డాక్టరేట్ పట్టా అనేది ఏదైనా విశ్వవిద్యాలయం తరఫున వారి వారి హోదాలను గుర్తిస్తూ గౌరవంగా ఇచ్చే పట్టా. కాని పద్మభూషణ్ గుర్రం జాషువా స్మారక కళాపరిషత్ తరఫున ఎంపిక చసిన ఏడుగురి కోసం నిర్వాహకుడు యో హాన్ ఫేక్ డాక్టరేట్ పట్టా లు తయారు చేయించినట్లు పోలీసులు తెలిపారు. అవి ప్రశంసా పత్రాల రూపంలో ఉన్నాయన్నారు.
అతడిని అదుపులోకి తీసుకున్న క్రమంలో డాక్టరేట్లు ఇవ్వకూడదా, ఏమైనా నిబంధనలు ఉంటాయా అని పోలీసులనే అడగడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. కాగా, 75 ఏండ్ల వయస్సున్న యోహాన్‌పై కోర్టు అనుమతితో చర్యలు తీసుకుంటామని సైఫాబాద్ ఇన్స్పెక్టర్ తెలిపారు. అవార్డుకు ఎంపిక చేసిన వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీలోనూ ఇలాంటి ప్రదానోత్సవం మరొకటి జరుగడంతో ఆ కార్యక్రమంపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.