బంజారాహిల్స్, ఆగస్టు 18 : చాక్లెట్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు.. నోరూరించే చాక్లెట్లను విభిన్నమైన రూపాల్లో తయారు చేస్తున్న అనేక ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బ్రాండ్లు మార్కెట్లో కనిపిస్తుంటాయి. అయితే చాక్లెట్ తయారీని కేవలం యాంత్రికంగా కాకుండా ఒక కళలాగా బావిస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో అచ్చమైన తెలుగు పేరుతో సరికొత్త చాక్లెట్ ఉత్పత్తులను ప్రజలకు అందించేందుకు బంజారాహిల్స్ రోడ్ నం.12లో ‘మనం’ -ది ఇండియన్ క్రాఫ్ట్ చాక్లెట్ పేరుతో సరికొత్త తయారీ కేంద్రం ప్రారంభమైంది.
శుక్రవారం మనం చాక్లెట్ క్రాఫ్ట్ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ అధినేత చైతన్య ముప్పాల వివరాలను వెల్లడించారు. చాక్లెట్ తయారీలో అత్యంత ప్రధానమైన కోకో గింజలను నేరుగా రైతుల వద్దనుంచి సేకరించడంతో పాటు అత్యంత నాణ్యమయిన విధానాల ద్వారా కకావ్ (కోకో గింజలనుంచి తయారు చేసే పదార్థం)ను తయారు చేస్తున్నామని, పశ్చిమగోదావరి జిల్లాలోని 100మంది కోకో పండించే రైతులను తమ సంస్థలో ప్రధాన పాత్రధారులుగా మార్చామని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ‘మనం’ క్రాఫ్ట్ చాక్లెట్ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు.