మేడ్చల్, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ): మున్సిపాలిటీల నుంచి సకాలంలో ధృవపత్రాలు జారీ చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 13 మున్సిపాలిటీలలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ధృవపత్రాల కోసం ప్రజలు చేసిన దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా పేరుకపోతున్నాయి. దీంతో సంబంధిత కార్యాలయాలు చుట్టూ ప్రజలు తిరగాల్సిన పరిస్థితి నెలకొంది.
సాధారణంగానే పట్టణాల పరిధిలో జనన, మరణ ధృవపత్రాల కోసం దరఖాస్తులు అధికంగా వస్తుంటాయి. దీనికి తోడు మున్సిపాలిటీలలో కొనసాగుతున్న ప్రత్యేక పాలన నేపథ్యంలో ధృవపత్రాల జారీలో త్రీవ జాప్యం నెలకోనడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలలో విలీనం చేసిన విషయం తెలిసిందే.
గతంలో 28 గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయగా.. మరో 3 మున్సిపాలిటీలలను నూతనంగా ఏర్పాటు చేసి ఇందులో 34 గ్రామాలను విలీనం చేసే పక్రియ ప్రస్తుతం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయా మున్సిపాలిటీల్లో జనన, మరణ ధృవపత్రాలతో పాటు ఇంటి అనుమతులు, ఇంటి నంబర్లు, మ్యూటేషన్లు, నల్లా అనుమతులు పొందాడానికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి పనికి రోజుల తరబడి సమయం పడుతోందని దరఖాస్తుదారులు వాపోతున్నారు.
పన్ను వసూళ్లపై ఉన్న దృష్టి అభివృద్ధిపై లేదు..
మున్సిపల్ అధికారులకు పన్ను వసూళ్లపై ఉన్న దృష్టి అభివృద్ధిపై లేకుండా పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమస్యలపై ఫిర్యాదు చేస్తే మున్సిపాలిటీలలో తగినంత నిధులు లేవని ఇప్పుడు పనులు చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మున్సిపాలిటీలకు నియమించిన ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా సిబ్బంది నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు మున్సిపాలిటీలలో సేవలను సత్వరమే అందించేవిధంగా చర్యలు తీసుకోవడంతో పాటు ఉద్యోగులు విధులు సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.