దుండిగల్, మే 8: గండి మైసమ్మ-దుండిగల్ మండలంలోని ప్రభుత్వ భూముల పరిశీలన ఉద్రిక్తతకు దారితీసింది. మండల పరిధి డి.పోచంపల్లిలోని సర్వేనెంబర్ 120/11 ప్రభుత్వ భూమిలోని 2 ఎకరాల 25 గుంటల స్థలాన్ని 2016లో అప్పటి ప్రభుత్వం ట్రైబల్ వెల్ఫేర్ సంస్థకు కేటాయించింది. అయితే సర్వేనెంబర్ 120లోని ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో సంబంధిత స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు నిర్ణయించుకున్న ట్రైబల్ వెల్ఫేర్ సంస్థ అధికారులు..
సంబంధిత స్థలం హద్దుపద్దులను చూపించాలని రెవెన్యూ అధికారులను కోరగా, గురువారం ట్రైబల్ వెల్ఫేర్ అధికారులతో కలిసి రెవెన్యూ అధికారులు హద్దులు ఏర్పాటు చేసే పనులను చేపట్టారు. అయితే సదరు స్థలంలో తమకు పట్టాలు ఉన్నాయంటూ తమ స్థలాన్ని కొంతమేర ట్రైబల్ వెల్ఫేర్ స్థలంలో కలుపుతున్నారని స్థానికులు కొందరు కోర్టు జారీచేసిన కాగితాలతో వచ్చి హద్దురాళ్ల ఏర్పాటును వ్యతిరేకించారు.
హైకోర్టు దీనిపై స్టే విధించిందని కొందరు పేర్కొనగా, మరికొందరికి జీవో నెంబర్ 58, 59 ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని పేర్కొంది అంటూ అధికారుల స్థల పరిశీలనను, హద్దురాళ్ల ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నం చేశారు. 2016 నుంచి రాని ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు కోర్టుకు సెలవులు ఉన్న రోజుల్లో వచ్చి తమకు అన్యాయం చేయాలని చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య స్థల పరిశీలన చేసిన రెవెన్యూ అధికారులు హద్దురాళ్లని ఏర్పాటు చేశారు. దీంతో తాము మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని స్థానికులు పేర్కొనడం గమనార్హం.