చందానగర్ పోలీస్ స్టేషన్‌కు సరిగ్గా కిలోమీటర్ దూరంలో.. కాలినడకన నడుచుకుంటూ వెళితే 5 నిమిషాల సమయం మంగళవారం ఉదయం సరిగ్గా 10.35నిముషాలు.. చందానగర్‌లోని ఖజానా జువెల్లర్స్ షోరూమ్..మాస్క్‌లు ధరించి ఒక్కసారిగా లోపలికి వచ్చిన దుండగులు.. వచ్చీ రావడంతోనే గన్‌తో సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించారు. ఆ తర్వాత సిబ్బందిని బెదిరించి ఎవరూ కదలవద్దంటూ ఒక మూలన కూర్చోబెట్టారు.
షోకేసుల తాళాలు ఇవ్వకపోవడంతో డిప్యూటీమేనేజర్ కాళ్లపై కాల్చారు. సిసి కెమెరాలపై కూడా కాల్పులు జరిపారు. ఆ తర్వాత బంగారు ఆభరణాలు ఉన్న షోకేసులను పగలగొట్టారు. అక్కడ ఉన్న నగలు, ఆభరణాలు అన్నీ మూడు బ్యాగుల్లో నింపుకున్నారు. కేవలం 5 నిముషాల నుంచి 8 నిముషాల సమయంలో ఆరుగురు దొంగలు ఈ దోపిడీ చేశారు. ఆ తర్వాత పోలీసులు వచ్చే లోపే బైకులపై జహీరాబాద్వైపు వెళ్లిపోయారు.
సిటీబ్యూరో/కొండాపూర్, ఆగస్ట్ 12(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో పట్టపగలే దుండగులు రెచ్చిపోయారు. చందానగర్‌లో భారీ దోపిడీకి ప్రయత్నించారు. ఆరుగురు దుండగులు ప్రముఖ నగల దుకాణం ఖజానాజ్యువెల్లర్స్లో ప్రవేశించి తుపాకులతో కాల్పులు జరుపుతూ దోపిడీకి ప్రయత్నించారు. దొంగతనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సిబ్బందిపై దాడి చేయడమే కాకుండా, కాల్పులు కూడా జరిపారు. దుండగుల కాల్పుల్లో షాపులోని పలువురు సిబ్బందికి గాయాలు అయ్యాయి. పోలీసుల రంగప్రవేశంతో దుండగులు షాపులో నుంచి తప్పించుకుపోయారు. కేసు నమోదు చేసిన చందానగర్ పోలీసులు, దుండగుల కోసం గాలిస్తున్నారు.
గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దుండగులు ముందుగా ఖజానా జువెల్లర్స్ గేట్ సిబ్బందిపై దాడిచేస్తూ లోపలికి ఎంటర్ అయ్యారు. తాము తాళాలు అడిగితే లేవంటూ చెప్పిన డిప్యూటీ మేనేజర్ సతీశ్‌కుమార్ కాళ్లపై తుపాకీతో కాల్పులు జరపడంతో ఆయన కాళ్లకు గాయాలయ్యాయి. ఆ తర్వాత షాపులోపల బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ పగులగొట్టారు.
అవన్నీ మూడు బ్యాగుల్లో నింపుకుని అక్కడినుంచి బయటకు వచ్చి బైకులపై వెళ్లిపోయారు.ఈలోగా సిబ్బందిలో ఒకరు పోలీసులకు కాల్ చేయగా.. పోలీసులు వచ్చే సమయానికే దొంగల ముఠా పారిపోయింది. దుండగుల వద్ద మూడు తుపాకులు ఉన్నాయని, రెండు రౌండ్ల ఫైరింగ్ చేశారని పోలీసులు చెప్పారు. సిసి కెమెరాలపై కాల్పులు జరిపి వాటిని కూడా ధ్వంసం చేశారు. గ్యాంగ్‌లో మొత్తం ఆరుగురు సభ్యులున్నట్లు సిసి ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. దోపిడీకి పాల్పడిన దొంగల కోసం పది ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు పరిసరప్రాంతాల్లోని సిసిఫుటేజ్లను స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల్లో గాయపడిన సతీష్‌ను ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉందని ఖజానా జువెల్లర్స్ షోరూం లక్ష్యంగా దొంగల ముఠా పక్కా ప్రణాళిక అమలు చేసింది. సినీఫక్కీలో షాపులో జనం లేని సమయంలోఒక్కసారిగా వచ్చి దాడి చేయడానికి అవసరమైన రెక్కీ చేసి ఆ తర్వాత టైమ్ చూసుకుని దాడి చేశారు. వారం రోజులుగా నిందితులు షోరూమ్ లేఔట్‌ను ముందుగానే అధ్యయనం చేసి దోపిడీకి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. షాపు తెరిచిన వెంటనే దుండగులు లోపలికి వచ్చి దోపిడీకి పాల్పడ్డారు. వీరంతా మధ్యప్రదేశ్‌కు చెందిన ముఠా సభ్యులుగా పోలీసులు భావిస్తున్నారు. దుండగులు కాల్పులు జరిపిన ప్రదేశం నుంచి రెండు ఖాళీ షెల్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరు దోపిడీ తర్వాత జహీరాబాద్ వైపుకు బైకులపై వెళ్లినట్లుగా పోలీసులు చెబుతున్నారు. సీసీ టీవీ ఫుటేజ్‌ల ఆధారంగా దుండగుల కదలికలను ఆరాతీస్తున్నారు. దుండగులు ఆరుగురి కంటే ఎక్కువ మందే ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు.
ఖజానా జువెల్లర్స్‌లో దోపిడీకి పాల్పడింది ఆరుగురా ఏడుగురా అనేది ఇంకా తేలాల్సి ఉందని సైబరాబాద్ సిపి అవినాశ్ మహంతి అన్నారు. దొంగలను పట్టుకునేందుకు పది బృందాలను ఏర్పాటు చేశామని, వీరంతా ఇప్పటికే నగర సరిహద్దులను అప్రమత్తం చేసి గాలింపు చర్యలు చేపట్టారని ఆయన పేర్కొన్నారు. ఖజానా జువెల్లర్స్‌లో దోపిడీ జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి సీపీ అవినాశ్ మహంతి అక్కడకు చేరుకున్నారు. సంఘటన జరిగిన తీరుపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. బయట డిస్ప్లేలో ఉన్న సిల్వర్ జువెల్లరీ తీసుకుపోయినట్లు చెబుతున్నారని, ఎంత పోయిందనేది దుకాణదారులు అంచనా వేస్తున్నారని తెలిపారు. మొత్తం ఏడుగురు ఈ సంఘటనలో పాల్గొన్నట్లు తెలుస్తుందని సీపీ చెప్పారు. లోకల్ పోలీస్, సీపీఎస్, ఎస్ఓటీ, క్లూస్ టీమ్ పనిచేస్తున్నాయని, దొంగలను త్వరలోనే పట్టుకుంటామని అవినాశ్ చెప్పారు.
భారీ దోపిడీకి స్కెచ్ వేసినప్పటికీ దొంగల ప్రయత్నాలు ఫలించలేదు. వెండి సామాగ్రి దొంగతనం చేసినప్పటికీ మరోవైపు బంగారు ఆభరణాలు అనుకుని బంగారుపూత పూసిన వెండి నగలను షో కేసులు పగులగొట్టి మరీ దొంగలు ఎత్తుకెళ్లారు. మరోవైపు అసలు బంగారం ఇంకా బయటకు తీసుకురాలేదని తెలుస్తోంది. ఖజానా జువెల్లర్స్‌లో షాపు తెరిచిన వెంటనే దోపిడీ జరగడంతో షాపు లాకర్లో ఉన్న బంగారం తీసుకురావడానికి మేనేజర్, సెక్యూరిటీ అధికారి లోపలికి లాకర్ రూమ్‌లోకి వెళ్లారు. ఆ సమయంలో బయట ఈ దోపిడీ వ్యవహారం అంతా జరిగింది. వారు పదినిముషాల తర్వాత బయటకు వచ్చి చూస్తే మొత్తం చిందరవందరగా కనిపించడంతో ఆశ్చర్యపోయారు. కేవలం పది నిముషాల వ్యవధిలో పెద్ద ఎత్తున బంగారం పోకుండా దక్కిందని తాము లక్కీ అంటూ ఖజానా సిబ్బంది చెప్పారు.