వెంగళరావునగర్, మే 9 : పేటీఎం నుంచి లోన్ ఇప్పిస్తానని నమ్మించి రూ.60 వేలు కాజేసిన ఘటన మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డిగూడకు చెందిన కె.రాకేశ్కుమార్కు అక్కడే ఇస్త్రీ షాపు ఉంది. ఈ నెల 1న గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తాను పేటీఎం డిస్టిబ్యూటర్నంటూ పరిచయం చేసుకున్నాడు. దీంతో రాకేశ్ తనకు రూ.5 లక్షలు రుణం కావాలని కోరగా.. ఇప్పిస్తానని నమ్మబలికాడు. దానికి రూ.5 వేలు ప్రాసెసింగ్ ఫీజుగా ఇవ్వాలని చెప్పడంతో వెంటనే రాకేశ్ అతనికి రూ.5 వేలు పంపించాడు.
తిరిగి ఈనెల 4న షాపు వద్దకు వచ్చి మీకు పేటీఎం ద్వారా రూ.5 లక్షలు రుణం మంజూరైందని.. ఇందుకు రూ.70 వేలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పాడు. వెంటనే రాకేశ్ ఫోన్ తీసుకుని అతని ఖాతా నుంచి రూ.55 వేలను మరో అకౌంట్కు బదిలీ చేసుకుని అక్కడ నుంచి జారుకున్నాడు. అయితే తన అకౌంట్లోకి లోన్ డబ్బు రాలేదని తెలుసుకుని.. అతడి గురించి ఆరా తీయగా అమీర్పేట్లో ఉంటున్నట్లు తెలుసుకున్నాడు. అక్కడికి వెళ్లి విచారించగా అతని పేరు ఫుజైల్ అహ్మద్ షరీఫ్ అని, అక్కడి నుంచి గదిని ఖాళీ చేసినట్లు తెలుసుకున్నాడు. అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.