సిటీబ్యూరో, జూన్ 4 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పార్లమెంట్ స్థానంపై అసదుద్దీన్ ఒవైసీ మరోసారి సత్తా చాటారు. సమీప బీజేపీ అభ్యర్థి మాధవీలతపై 3, 38,087 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సికింద్రాబాద్ పార్లమెంట్ విషయానికొస్తే కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌పై బీజేపీ అభ్యర్థి జి. కిషన్‌రెడ్డి విజయం సాధించి సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకున్నారు. దానం నాగేందర్‌పై 49,944 ఓట్ల తేడాతో కిషన్‌రెడ్డి విజయాన్ని అందుకున్నారు. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో కమలం రెపరెపలాడింది. కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్‌రెడ్డిపై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 3,91,475 ఓట్లతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. చేవెళ్ల పార్లమెంట్‌ను పరిశీలిస్తే బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి 7,98,517 ఓట్లు రాగా..కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి 6,30,861 ఓట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి పై కొండా విశ్వేశ్వర్ రెడ్డి 1,67,656 మెజార్టీతో గెలుపొందారు.