HMPV | సిటీబ్యూరో: నగరంలో హెచ్ఎంపీవీ కేసులు నమోదైనట్లు వస్తున్న వార్తలు పూర్తి అవాస్తవమని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాయక్ వెల్లడించారు. ఒక ప్రైవేటు ల్యాబ్లో జరిపిన పరీక్షల్లో 11 మందికి హెచ్ఎంపీవీ పాజిటివ్ వచ్చినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై డీహెచ్ స్పందిస్తూ రాష్ట్రంలో తమ రికార్డుల ప్రకారం ఇప్పటి వరకు ఎక్కడా కూడా హెచ్ఎంపీవీ కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు.
అనవసరంగా ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి, సొమ్ము చేసుకునే క్రమంలో కొన్ని ప్రైవేటు ల్యాబ్లు, దవాఖానలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, ప్రజలు వీటిని నమ్మవద్దన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ముందస్తు చర్యలు చేపట్టామని, గాంధీ, నిలోఫర్ తదితర దవాఖానల్లో ఇప్పటికే ప్రత్యేక వార్డులు సైతం ఏర్పాటు చేసినట్లు డీహెచ్ డా.డాక్టర్ రవీంద్రనాయక్ వెల్లడించారు. హెచ్ఎంపీవీ వైరస్ పెద్ద ప్రమాదకారి కాదని, అయినప్పటికీ ప్రజలు ముంద జాగ్రత్త చర్యలు పాటించాలన్నారు.