సైదాబాద్ : కులం, ఆధాయ ధ్రువీకరణ పత్రాలను( Certificates) సకాలంలో జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ (BRS) నాయకులు శనివారం సైదాబాద్ మండల తహసీల్దార్ జయశ్రీ కి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కుర్మగూడ డివిజన్ అధ్యక్షులు నర్సింగరావు, సంతోష్ నగర్ అధ్యక్షులు చింతల శ్రీనివాసులు మాట్లాడారు.
ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్ యువ వికాసం ( Rajiv Yuva Vikas) పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన ఆధాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలను జారీ చేయడంలో మండల రెవెన్యూ అధికారులు నిర్లక్ష్య వైఖరితో అవలంబిస్తున్నారని ఆరోపించారు. రోజుల తరబడి ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటూ ఇబ్బందులు గురి చేస్తున్నారని వెల్లడించారు.
ప్రభుత్వం వచ్చేనెల 5వ తేదీ చివరి గడువు ప్రకటించడంతో అందుకు కావలసిన ధ్రువీకరణ పత్రాలు సకాలంలో జారీ కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి త్వరిత గతిన ఆధాయ, కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు హరినాథ్, తదితరులు పాల్గొన్నారు.