Operation Sindoor | సిటీ బ్యూరో, మే 8 (నమస్తే తెలంగాణ): భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాకిస్థాన్ కవ్వింపు చర్యలను ఇండియా సమర్థవంతంగా తిప్పికొడుతున్నది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో యుద్ధం జరిగితే హైదరాబాద్ నగరంపై ఎలాంటి ప్రభావం ఉంటుందోనని అనుమానాలు అందరిలో ఉంటాయి. 1971లో పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి మద్దతివ్వడం వల్ల యుద్ధం అనివార్యమైంది. ఈ నేపథ్యంలో భారత్-పాక్ మధ్య యుద్ధం జరిగింది.
ఆ సమయంలో హైదరాబాద్‌లో హైఅలర్ట్ జారీ చేశారు. యుద్ధ ప్రభావం ప్రత్యక్షంగా లేకపోయినా ప్రజలను సన్నద్ధం చేసేందుకు ఎయిర్ రైడ్ డ్రిల్స్ నిర్వహించి, ఎయిర్ రైడ్ సైరన్లు మాత్రం మోగించారు. ఈ ప్రక్రియ యుద్ధం జరిగినన్ని రోజులూ కొనసాగించారు. పాకిస్థాన్ బలగాలు హైదరాబాద్‌పై దాడి చేసే పరిస్థితులు ఏర్పడితే సురక్షితంగా ఎలా బయటపడలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడిన ఎదుర్కొనేందుకు ప్రజలను మానసికంగా సిద్ధం చేశారు.
నిత్యం సైరన్లు మోగడం, ఎయిర్ డ్రైవ్ డ్రిల్స్ జరగడం వల్ల అప్పటి ప్రజలు ఒకింత ఆందోళనలకు గురైనా.. భద్రతా బలగాలు వారికి పరిస్థితులను వివరించి ఎలాంటి దాడులు జరగవని భరోసా కల్పించారు. 1971 యుద్ధ ఆనవాళ్లు నగరంలో లేకపోయినా అప్పటి పరిస్థితులు ప్రజలకు ఇంకా గుర్తున్నాయి. మన ప్రాంతం నుంచి అనేక మంది జవాన్లు, ఆర్మీ అధికారులు అప్పటి యుద్ధంలో పాల్గొన్నారు. పాకిస్థాన్‌పై యుద్ధం గెలుపొందడంలో కీలక పాత్ర పోషించారు.
యుద్ధ ఖైదీల క్యాంపులు..
1971 యుద్ధంలో 93 వేల మంది పాకిస్థాన్ సైనికులను ఇండియా యుద్ధ ఖైదీలుగా అదుపులోకి తీసుకుంది. వీరందరినీ ఉంచడానికి దేశవ్యాప్తంగా క్యాంపులు ఏర్పాటు చేసింది. ఈ క్యాంపులను పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాలకు దూరంగా ఏర్పాటు చేసి భారత ఆర్మీ ఆధీనంలో ఉంచారు. హైదరాబాద్ కూడా పాక్ సరిహద్దులకు దూరంగా ఉండటం వల్ల ఇక్కడ కొన్ని క్యాంపులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నది. కానీ ఇప్పటి వరకు దానిపై ఎలాంటి సమాచారం బయటకు తెలియలేదు.
పలువురు ఆర్మీ మాజీ సైనికాధికారులు మాత్రం ఇక్కడ ఏర్పాటు చేసిన పీవోడబ్ల్యూ క్యాంపుల్లో ఖైదీలకు మెరుగైన సౌకర్యాలు కల్పించినట్లు పలు సందర్భాల్లో మాట్లాడినట్లు తెలుస్తున్నది. భారత రక్షణ రంగ కార్యాలయాలు, శిక్షణ కేంద్రాలు నగరంలో ప్రముఖంగా ఉండటం వల్ల ఇక్కడ క్యాంపులను ఏర్పాటు చేసి ఉంటారని పలువురు రిటైర్డ్ ఆర్మీ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు కూడా భారత్-యుద్ధం అనివార్యమైతే యుద్ధ ఖైదీలను ఇక్కడ ఉంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.