మణికొండ, అక్టోబర్ 13: రంగారెడ్డి జిల్లాలోని ౧౪ శాసనసభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో కొత్తగా ఏర్పడిన రాజేంద్రనగర్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ధనిక నియోజకవర్గంగా అవతరించింది. బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఈ నియోజకవర్గం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కాగా ఇక్కడ రాజకీయ పరిణామాలు ఎంతో క్రీయాశీలకంగా కొనసాగుతాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో తాజా ఓటరు జాబితా ప్రకారం.. ౫,౫౨,౩౬౨కు చేరుకుంది. ౨౦౧౮ సార్వత్రిక ఎన్నికల సమయంలో ౪,౪౧,౦౦౫ మంది ఓటర్లు ఉండగా గడిచిన ఐదేండ్లకాలంలో నియోజకవర్గంలో కొత్తగా ౧,౧౧,౩౫౭ ఓట్లు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. మొదటిసారి ఓటుహక్కును వినియోగించుకునేందుకు ౧౦,౪౮౮ మంది ఓటరు నమోదు చేసుకున్నారు. తుది జాబితా వచ్చేలోపు మరో మూడు వేల వరకు పెరగవచ్చునని తెలుస్తుంది.
ఇదిలావుంటే నియోజకవర్గం ఏర్పాటైన నాటి నుంచి ఇక్కడ బీసీలదే ఆధిపత్యం కొనసాగుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుత ఓటర్ల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే ౩లక్షల౬౧వేల ఓటర్లంతా బీసీలే కావడం గమనార్హం. లక్షా ౩౨వేల పైచీలుకు మైనార్టీ ఓటర్లు, ఇతర వర్గాలకు వారు నియోజకవర్గంలో ఉన్నారు. అయితే ఇక్కడ రాజకీయం మొత్తం బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి ఇక్కడ బరిలో అన్ని రాజకీయ పార్టీల నుంచి బీసీల మధ్యే హోరాహోరి పోటీ కొనసాగుతుండగా ఈసారి ఏ సామాజిక వర్గాల మధ్య పోటీ ఉంటుందని స్థానికంగా ఆసక్తి నెలకొన్నది.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. దీంతో ఈ ప్రాంతంలో ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకుని ఓటర్లుగా నమోదయ్యారు. వీరంతా ఏ పార్టీలకు మద్దతు పలుకుతారనేది ప్రశ్నగా మిగిలింది.
ఇక వివిధ రాజకీయ పార్టీల్లో బీసీ నేతలే క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నా ఆయా పార్టీలు ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు ఎమ్మెల్యే టిక్కెట్లు కట్టబెడతారా అనే అంశంపై బీసీ వర్గాల చర్చనెలకొన్నది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కే మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీలోనూ బీసీల మధ్యే ఆశావహుల పోటీ ఉన్నప్పటికీ తాండూరు టిక్కెట్టు ఆశిస్తున్న కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇదిలావుండగా బీజేపీ పార్టీ నుంచి ౫౬ మంది ఆశావహులు ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం దరఖాస్తులు చేసుకోగా వీరిలో ప్రధానంగా తోకల శ్రీశైలంరెడ్డి, అతడి తనయుడు కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి, తోక అంజన్‌కుమార్‌గౌడ్, కె.నరేందర్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అంతేగాక మజ్లిస్ పార్టీ నుంచి సైతం ఈసారి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకే బరిలో ఉంటే టిక్కెట్టు కట్టబెట్టాలని యోచిస్తున్నట్లు తెలిసింది. బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు కాకుండా ఇతర సామాజిక వర్గాలకు చెందిన ఆశావహులకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు టిక్కెట్టు కట్టబెడితే రాజేంద్రనగర్‌లో సార్వత్రిక ఎన్నికల పోరు రసవత్తరంగా సాగనుంది.