సిటీబ్యూరో, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా పరిశోధనలపై జేఎన్టీయూ హైదరాబాద్ అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. విద్యార్థులు ఇంజినీరింగ్‌లో నాలుగేండ్ల బీటెక్ కోర్సులు పూర్తి చేసి, ఏదో ఒక ఉద్యోగంలో చేరుతున్నారని, దాని వల్ల పరిశోధనలకు విఘాతం కలుగుతుందని భావించిన యూనివర్సిటీ అధికారులు పరిశోధన కోర్సుల్లో ప్రవేశాలు పొందే విధంగా విద్యార్థులను సన్నద్ధం చేయాలని యోచిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో పీహెచ్‌డీలో ప్రవేశాల సంఖ్యను పెంచి.. నాణ్యమైన పరిశోధనలు చేయాలనుకుంటున్నారు. అందుకోసం దేశ వ్యాప్తంగా పరిశోధనలకు ఆర్థిక సహకారం కోసం ఫండింగ్ సంస్థలతో యూనివర్సిటీ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఏఐఎంల్, రోబోటిక్స్, డాటా సైన్స్, సైబర్ క్రైమ్ వంటి పలు కోణాలలో రీసెర్చ్‌ని మెరుగుపరుచాలని భావిస్తున్నారు. అందుకోసం నేషనల్ ఎసెస్మెంట్ అండ్ అక్రిడిటేయేషన్ కౌన్సెల్ (న్యాక్) గుర్తింపు గ్రేడ్‌ను మరింత మెరుగు పరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సారి యూనివర్సిటీకీ న్యాక్ ఏ++ గ్రేడ్ వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి తెలిపారు.
దేశ వ్యాప్తంగా ఉన్న ఫండింగ్ సంస్థలలో.. అటనామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు, ఏరోనాటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బోర్డు, డీఆర్డీవో, సీఎస్ఐఆర్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటనామిక్ ఎనర్జీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, రీసెర్చ్ ఇన్ న్యూక్లియర్ సైన్సెస్ వంటివి ఉన్నాయి. అయితే పరిశోధనల కోసం నిధులు విడుదల చేసే క్రమంలో ఆయా సంస్థల మార్గదర్శకాలు కూడా పాటించాలని ఇప్పటికే విద్యార్థులకు తెలియజేస్తున్నట్లు యూనివర్సిటీ ఉన్నతాధికారులు ఈ సందర్భంగా తెలిపారు.
జేఎన్టీయూ హైదరాబాద్‌లో ప్రస్తుతం 350 వరకు అధ్యాపకుల పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడంపై అధికారులు దృష్టి సారించారు. యూనివర్సిటీని అభివృద్ధి పథంలోకి దూసుకెళ్లడానికి చర్యలు తీసుకుంటున్నామని, ఆ మేరకు న్యాక్ గుర్తింపు కోసం మరో సారి కృషి చేస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు.