ఖైరతాబాద్, మే 20 : రాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్‌లో భద్రత ప్రశ్నార్థంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజ్‌భవన్‌లో ప్రవేశించాలంటే మూడంచెల భద్రతను దాటుకొని కార్యాలయం ఉన్నతాధికారులు, సెక్యూరిటీ అధికారుల అనుమతి తప్పని సరి. 24/7 భద్రతను అధికారులు పర్యవేక్షిస్తుంటారు. అలాంటి కార్యాలయంలో ఓ సాధారణ ఉద్యోగి, ఆపై సస్పెన్షన్‌కు గురైన వ్యక్తి నేరుగా ఐటీ సెల్లో ప్రవేశించడమే కాకుండా ఏకంగా హార్డ్ డిస్క్ ఎత్తుకెళ్లడంతో అక్కడ భద్రత ప్రశ్నార్థకంగా మారినట్లు కనిపిస్తోంది. సహ మహిళా ఉద్యోగి ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసిన కేసులో ఐటీ సెల్లో పనిచేస్తున్న హార్డ్‌వేర్ ఉద్యోగి శ్రీనివాస్‌పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
బెయిల్‌పై వచ్చిన వెంటనే కేసును తారుమారుచేద్దామన్న ఉద్దేశంతో మళ్లీ ఐటీ విభాగంలోకి ప్రవేశించి మార్ఫింగ్ చేసిన కంప్యూటర్‌కు సంబంధించిన హార్డ్ డిస్క్‌ను సీపీయూ నుంచి బయటకు తీసి ఎత్తుకెళ్లాడు. సదరు హార్డ్ డిస్క్‌లో అత్యంత విలువైన సమాచారంతో పాటు లైసెన్సు కలిగిన సాఫ్ట్వేర్, కార్యాలయం నెట్వర్క్ ఐడీ, పాస్‌వర్డ్‌తో పాటు ఐటీకి సంబంధించిన ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ ఉన్నట్లు ఉన్నతాధికారులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు అతడిని అరెస్టు చేసి హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నా అందులో నిక్షిప్తమైన సమాచారం ఏమైనా బయటకు వెళ్లిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి 10.11గంటలకు ఐటీ సెల్ కార్యాలయం తాళం వేసి ఉన్న సమయంలో శ్రీనివాస్ లోనికి హెల్మెట్ ద్వారా ప్రవేశించాడు.
గోప్యంగా ఉంచిన పోలీసులు..
ఈ నెల 10 న మహిళా ఉద్యోగి ఫొటో మార్ఫింగ్‌పై పోలీసులకు రాజ్‌భవన్ అధికారులు ఫిర్యాదు చేయగా శ్రీనివాస్‌ను 12న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు 14న హార్డ్ డిస్క్ ఎత్తుకెళ్లి మరో నేరం చేయగా, 15న అతడిని మళ్లీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రెండు ఎపిసోడ్లలో నేరం జరిగినా పోలీసులు విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. సెక్యూరిటీ వైఫల్యం వెలుగు చూడకుండా ఉన్నతాధికారుల అధికారుల ఒత్తిడి మేరకు పంజాగుట్ట పోలీసులు విషయాన్ని దాచిపెట్టినట్లు సమాచారం.