సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ) : విద్యాసంస్థల బస్సులపై ఆర్టీఏ అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే నగరంలో అడ్మిషన్ల ప్రక్రి య జోరందుకోవడంతో స్కూల్, కాలేజీ బస్సులు ప్రచారం కోసం రోడ్డెక్కుతున్నాయి. జూన్ ప్రారంభంలో ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రారంభం కానుండటంతో రవాణా శాఖ అధికారులు బస్సుల ఫిట్నెస్పై యాజమాన్యాలకు సూచనలు చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల రవాణా శాఖ పరిధిలో 11,834 విద్యాసంస్థల బస్సులు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 70 శాతం బస్సులు ఫిట్నెస్ రెన్యూవల్ చేసుకున్నాయని ఉన్నతాధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడిపితే యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. ఐదు రకాల వాహనాల వేగానికి కళ్లెం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో విద్యాసంస్థల బస్సులు కూడా ఉన్నాయి. ఫిట్నెస్కు ముందే ఆయా వాహనాల్లో వేగ నియంత్రణ పరికరాలు ఉండాలని అధికారులు తెలిపారు. 1.రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), వ్యాలీడ్ ఇన్స్యూరెన్స్ సర్టిఫికెట్, వ్యాలీడ్ ఫిట్నెస్ సర్టిఫికెట్ పర్మిట్, ట్యాక్స్ పేమెంట్ రశీదు (బకాయిలు లేకుండా), పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్, డ్రైవింగ్ చేసే డ్రైవర్ లైసెన్సు తప్పక వాహనంతో ఉండాలని తెలిపారు.