BSNL | మారేడ్‌పల్లి, సెప్టెంబర్ 2: సెల్‌ఫోన్ టవర్లకు అండర్ గ్రౌండ్ నుంచి వేసే విలువైన కాపర్ కేబుల్ వైర్లను దొంగిలించిన 14 మంది ముఠా సభ్యులను బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి 10 లక్షల విలువ చేసే 120 కిలోల కాపర్ వైర్, ఒకఆటో, రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సికింద్రాబాద్‌లోని నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్ వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి జీవనోపాధి కోసం వచ్చిన పలువురు హయత్‌నగర్‌లోని జంజారా కాలనీలో నివాసముంటూ అండర్ గ్రౌండ్ కేబుల్ వైర్ బిగించే కూలీలుగా పని చేస్తున్నారు.
వీరిలో వల్లపు వినోద్ (27), బండారి వీరన్న ( 30), వేముల శ్రీను (22), గుంజ రాములు (23), వేముల రాజేశ్ (19), గోగుల వినోద్ (35), వేముల ఏసు ( 35), వేముల నాగరాజు (26), వల్లపు వినయ్ (19), వేముల శ్రీను అలియాస్ శ్రీను ( 35), వేముల సైదులు (30), గుంజ కృష్ణ (42), బండి ప్రవీణ్ (21), ఒంటిపులి రాంబాబు (25) కలిసి నగరంలోని ఆయా ప్రాంతాల్లో పలు కంపెనీల ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకొని అండర్ గ్రౌండ్ కేబుల్ వైర్‌ను ఏర్పాటు చేస్తుంటారు.
రెండేండ్లుగా ఈ ముఠా సభ్యులు అండర్ గ్రౌండ్ కేబుల్ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేబుల్ వైర్‌ను దొంగతనం చేస్తున్నారు. దీంతో వీరిపై బోయిన్పల్లి, కార్ఖానా, అబ్దుల్లాపూర్‌మెట్, కుషాయిగూడ పోలీసు స్టేషన్ల పరిధిలో కాపర్ వైర్లు దొంగిలించినట్లు కేసులు నమోదయ్యాయని డీసీపీ వెల్లడించారు.
బీఎస్ఎన్ఎల్ ఫిర్యాదుతో..
బోయిన్పల్లి సెంటర్ పాయింట్ సమీపంలో ఉన్న నాలా వద్ద ఈ ముఠా సభ్యులు బీఎస్ఎన్ఎల్ సంస్థకు చెందిన అండర్ గ్రౌండ్ కేబుల్ కాపర్ వైర్‌ను చోరీ చేశారు. దీంతో ఈ ప్రాంతంలో బీఎస్ఎన్ఎల్ సేవలు నిలిచిపోయాయి. సంస్థ ప్రధాన కార్యాలయానికి ప్రజల నుంచి ఫిర్యాదులొచ్చాయి. వెంటనే సంస్థ ప్రతినిధులు, సిబ్బంది ఆ పరిసర ప్రాంతాల్లో పరిశీలించగా.. అండర్ గ్రౌండ్లో ఉన్న కేబుల్ కాపర్ వైర్లు చోరీకి గురైనట్టు గుర్తించారు. గతనెల 13న బీఎస్ఎన్ఎల్ ప్రతినిధులు బోయిన్పల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. స్థానికంగా ఉన్న సుమారు 200 సీసీ కెమెరాలను పరిశీలించి, ఒక ద్విచక్ర వాహనాన్ని గుర్తించారు. ఆ వాహనం నంబర్ ఆధారంగా ముఠా సభ్యులను గుర్తించారు.
ఎవరికీ అనుమానం రాకుండా…
పలు కంపెనీల ద్వారా అండర్ గ్రౌండ్ కేబుల్ వైర్లను బిగించే పనులకు కాంట్రాక్ట్‌ను ఈ ముఠా సభ్యులు ఒప్పంద కుదుర్చుకుంటారు. ఎక్కడైతే వీరు కాపర్ వైర్లను బిగించారో.. అక్కడే వైర్లు దొంగిలించారని పోలీసుల విచారణలో తేలింది. ఎవరికీ అనుమానం రాకుండా ఈ ముఠా సభ్యులు ఆయా కంపెనీలకు సంబంధించిన దుస్తులనే ధరించి.. కేబుల్ వైర్లను దొంగిలించి.. అక్కడి నుంచి వెళ్లిపోతారు. దొంగిలించిన కేబుల్ వైర్‌ను హయత్‌నగర్‌కు చెందిన కేతావత్ రమేశ్ నాయక్ (33), పెద్దఅంబర్‌పేట నివాసి సత్యనారాయణ (58)కు విక్రయించి, సొమ్ము చేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది.
ఈ ముఠా సభ్యుల్లో ప్రధాన నిందితుడు రమేశ్ సహా మరో ఇద్దరు నిందితులు వినోద్, మహేశ్ పరారీలో ఉన్నారని డీసీపీ తెలిపారు. ఈ ముఠా సభ్యులు తాడ్బంద్ సమీపంలో అనుమానాస్పదంగా ప్యాసింజర్ ఆటో, ఒక ద్విచక్రవాహనంపై తిరుగుతుండగా బోయిన్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. చేసిన నేరాన్ని అంగీకరించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ పి.అశోక్ కుమార్, బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణ మూర్తి, బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ బి.లక్ష్మీనారాయణ రెడ్డి, అడిషనల్ ఇన్స్పెక్టర్ బి.సర్దార్ నాయక్, ఎస్ఐలు బి. తుల్జారాం, క్రైం సిబ్బంది అనిల్ కుమార్, రమేశ్, మురళి, శివకుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.