సిటీబ్యూరో, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): తీగ లాగితే.. డొంక కదిలినట్లు.. దోపిడీ జరిగిందని ఓ వ్యాపారి ఫిర్యాదు చేస్తే.. ఫేక్ కరెన్సీ(సినిమా కరెన్సీ) వ్యవహారం బయటపడింది. ఆ నోట్లను డినామినేషన్లో మార్చుకునేందుకు ప్రయత్నించిన ఐదుగురు నిందితులను కీసర పోలీసులు అరెస్టు చేయగా, నిందితుల్లో ఓ మహిళ కూడా ఉంది. శనివారం కమిషనరేట్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్ వెల్లడించిన వివరాల ప్రకారం..కరీంనగర్ జిల్లాకు చెందిన అజీజ్, మహ్మద్ అన్వర్, తడుకా సుభాశ్ చంద్ర బోసు, మర్రి నాగరాజు, జంగం భాగ్యలక్ష్మి వీరంతా స్నేహితులు.
అందరూ కలిసి బ్లాక్ మని దందా చేద్దామని ప్లాన్ వేశారు. రూ. 2 వేల నోట్లు డిసెంబర్లో రద్దు అవుతున్నాయని, తమకు తెలిసిన వ్యక్తి దగ్గర అవి వందల కోట్లు ఉన్నాయని, దానిని మార్చుకునేందుకు అతడు ప్రయత్నిస్తున్నాడని ప్రచారం చేశారు. లక్ష నగదును (రూ.500 లేదా 100 ) డినామినేషన్లో ఇస్తే.. .అతను (2 వేల కరెన్సీ) ఐదు లక్షలు ఇస్తాడని చెప్పుకొచ్చారు. కరీంనగర్ జిల్లాలో ఓ ప్రైవేటు దవాఖానలో నర్సుగా పని చేస్తున్న భాగ్యలక్ష్మి రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజిరెడ్డికి ఈ విషయాన్ని చెప్పింది.
రూ. 5 లక్షలు (500, 100 డినామినేషన్)లో ఇచ్చేందుకు సిద్ధమైన రాజిరెడ్డి.. (2 వేల కరెన్సీ నోట్లు) రూ. 25 లక్షలు తీసుకునేందుకు ఆశపడ్డాడు. భాగ్యలక్ష్మి సూచనల మేరకు రాజిరెడ్డి ఈనెల 3న శామీర్‌పేట్ ఓఆర్ఆర్ వద్దకు వచ్చాడు. అతడిని కారులో అజీజ్, సుభాశ్ తిమ్మాయిపల్లి హెచ్ఎండీఏ లే-అవుట్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ పోలీస్ డ్రస్సులో నాగరాజు, మఫ్టీలో అన్వర్ ఇద్దరు ఆ కారును ఆపి మీరు బ్లాక్ మనీ దందా చేస్తున్నారంటూ.. తనిఖీ చేశారు. డబ్బులు చూసి.. బ్లాక్ మనీ సూత్రధారివి నువ్వేనని దబాయించడంతో రాజిరెడ్డి కారు దిగి పారిపోయాడు. అజీజ్, నాగరాజు, అన్వర్, సుభాశ్ చంద్రబోసుతో కలిసి డబ్బుతో ఉడాయించారు.
అసలు విషయం చెబితే.. తన బ్లాక్ మనీ దందా బయటకు వస్తుందని భావించిన రాజిరెడ్డి.. తనకు శామీర్‌పేటలో వద్ద కొందరు భూములను తక్కువ ధరకు ఇప్పిస్తామని చెప్పి..ఐదు లక్షలు కాజేశారని ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. విచారణలో భాగంగా కూపీ లాగితే.. నకిలీ నోట్ల బండారం బయటపడింది. అజీజ్, అన్వర్, నాగరాజు, సుభాష్చంద్రబోసు, భాగ్యలక్ష్మిలను అరెస్టు చేయగా, వీరికి సహకరించిన కరీంనగర్ లాడ్జి యజమాని రవీందర్‌సింగ్, రాజేశ్ పరారీలో ఉన్నారు. రాజీరెడ్డి నుంచి దోచుకున్న నగదులో పోలీసులు రూ. 1.30 లక్షలను రికవరీ చేశారు. కారు, ఎనిమిది ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు అన్వర్ కొన్ని చిత్రాల్లో ఆర్టిస్ట్‌గా పనిచేశాడు. ఇటీవల విడుదలైన చెక్ సినిమాలోనూ నటించాడు. సినిమా యూనిట్‌కు ప్రొడక్షన్ మేనేజర్‌గా పని చేసే నాగరాజు అమాయకులను బోల్తా కొట్టించేందుకు షూటింగ్‌ల్లో ఉపయోగించే కరెన్సీని ఉపయోగించాడు. నకిలీ నోట్లను ముద్రించేందుకు అజీజ్‌ను నిర్మాతగా పరిచయం చేసి.. కృష్ణానగర్‌లోని ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో కోటి రూపాయలు విలువైన రూ. 2 వేల నోట్లను (సినిమా షూటింగ్ కోసమంటూ..) ముద్రించారు. అలాగే షూటింగ్‌ల్లో ఉపయోగించే పోలీస్ డ్రస్సును నాగరాజు వాడినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు ముమ్మరం చేశారు.