సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): ఇండ్లలో పనికోసం చేరి దొంగతనాలకు పాల్పడుతున్న నేపాల్‌కు చెందిన ముఠాను ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్, మలక్‌పేట పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. సీపీ అంజనీకుమార్ కథనం ప్రకారం.. నేపాల్‌కు చెందిన కమల్ షాహి అలియాస్ కిత్నీ షాహి ముఠా సభ్యులు హైదరాబాద్, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ఇండ్లలో పనిచేసేందుకు వస్తారు. సెక్యూరిటీ గార్డులుగా కూడా చేరుతారు. అదను చూసి చోరీలు చేసి.. దొరక్కుండా తమ దేశానికి వెళ్లిపోతుంటారు. కమల్ షాహి 2018లో అబిడ్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఐదు మంది ముఠా సభ్యులతో కలిసి రూ. 1.19 కోట్లను దొంగలించి.. తప్పించుకు తిరుగుతున్నాడు. తాజాగా కమల్షాహి మనోజ్, చంద్, బిషాల్ షాహి, అశోక్ అతడి భార్య రేఖతో పాటు మరికొందరితో గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు.
మూసారాంబాగ్‌లో ఓ ఇంట్లో రేఖ పనిమనిషిగా చేరి.. యజమానికి సంబంధించిన వివరాలను గ్యాంగ్‌కు ఇచ్చింది. ఈ నేపథ్యంలో 12న యజమాని బయటకు వెళ్లడంతో ఇంట్లో రూ. 11. 5 లక్షలు తస్కరించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మలక్‌పేట, ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు 12 బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు నేపాల్ పారిపోకుండా దేశ సరిహద్దులతో పాటు పుణె, గుజరాత్, ముంబై, బెంగళూర్ నగరాల్లో కొన్ని బృందాలు గాలింపు చేపట్టాయి. మరికొన్ని టీమ్‌లు సాంకేతిక అంశాలను సేకరించి.. నగరంలో ముఠా నాయకుడు కమల్షాహితో పాటు గ్యాంగ్ సభ్యులైన బిషాల్ షాహి, ప్రకాశ్ పద్మ బహుదూర్ షాహి, మనోకుమార్ రావత్‌లను అరెస్ట్ చేశాయి. వారి వద్ద నుంచి రూ. 4 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నాయి. పరారీలో ఉన్న మిగతా సభ్యుల కోసం గాలిస్తున్నారు. ఈ సమావేశంలో టాస్క్‌ఫోర్స్ డీసీపీ గుమ్మి చక్రవర్తి, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.