వెంగళరావునగర్, ఆగస్టు 20: చిన్నారులకు నృత్యాలు నేర్పే ఓ డ్యాన్స్ మాస్టర్ ఉపాధి కరువై నేర ప్రవృత్తిలోకి అడుగు పెట్టాడు. చైన్ స్నాచింగ్ చేసి 24 గంటల వ్యవధిలోనే పోలీసులకు చిక్కాడు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు, డిటెక్టవ్ ఇన్స్పెక్టర్ రాంప్రసాద్ వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం, పెద్దపల్లికి చెందిన డి. సుచరిత మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నది. మధురానగర్‌కాలనీలోని ఓ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్న ఆమె రోజు మాదిరిగానే ఆఫీస్‌కు వెళ్లేందుకు గురువారం ఉదయం స్థానిక మెట్రో స్టేషన్ వద్ద లిఫ్ట్ కోసం వేచి ఉన్నది. ఆ సమయంలో నల్గొండ జిల్లా, నార్కట్‌పల్లికి చెందిన చింత వినోద్(27) వెనుక నుంచి వచ్చి సుచరిత మెడలోని రూ.45వేల విలువ చేసే బంగారు గొలుసును లాక్కెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ ఫుటేజీల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితుడిని శుక్రవారం అరెస్టు చేశారు. ఎంబీఏ పూర్తి చేసిన వినోద్ మధురానగర్లోనే ఓ బాయ్స్ హాస్టల్లో ఉంటున్నాడు. పిల్లలకు డ్యాన్స్ నేర్పుతూ ఉండేవాడు. కరోనాతో ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడని డీఐ తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించామన్నారు.