అబిడ్స్ ఆగస్టు 13(నమస్తే తెలంగాణ) అత్తింట్లో దొంగతనానికి పాల్పడ్డ అల్లుడిని బేగంబజార్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి వద్ద నుంచి 17 తులాల బంగారు, 55 తులాల వెండి ఆభరణాలు,70 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా నందవరం మండలం చామల గూడెం గ్రామం బీజీ కాలనీకి చెందిన షేక్ కలందర్ (28) అత్త పటేల్‌నగర్‌లో ఉంటారు. ఈ నెల 6న కలందర్ నాంపల్లిలో ఉన్న తన బావమరిది షేక్ షారూఖ్ దుకాణానికి వచ్చాడు. అతడు బావను ఇంటికి తీసుకెళ్లాడు. రాత్రి ఫారూఖ్ తన తల్లిని తీసుకొని వైద్యశాలకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి కలందర్ అత్తగారి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. 8న అల్మారాలో ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ జరిగిందని ఫారూఖ్ బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు అత్తింట్లో అల్లుడే దొంగతనానికి పాల్పడినట్లు నిర్ధారించుకొని కలందర్ను అరెస్ట్ చేశారు.