సిటీబ్యూరో, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): దొంగతనాలు, స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఘరానా దొంగను పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు కథనం ప్రకారం.. టోలిచౌక్ పారమౌంట్ కాలనీకి చెందిన మహ్మద్ సల్మాన్ ఖాన్ అలియాస్ భయ్యా చిన్న నాటి నుంచే చెడు అలవాట్లకు బానిసయ్యాడు. నగరంలో ఇప్పటి వరకు అతడు 13 కేసుల్లో అరెస్టయ్యాడు. 2015లో పీడీ యాక్ట్‌పై జైలుకు కూడా వెళ్లాడు. జైలు నుంచి తిరిగి వచ్చిన తరువాత కూడా బంజారాహిల్స్, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు, స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. విశ్వసనీయ సమాచారంతో పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజేశ్ బృందం నిందితుడిని అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి రూ. 3.6 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్, బైకులను స్వాధీనం చేసుకున్నది. ఈ కేసు తదుపరి విచారణను బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.