మన్సూరాబాద్, నవంబర్ 15: గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి వేళ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో చొరబడి నగదు, బంగారు బిస్కెట్లను అపహరించుకుపోయారు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హస్తినాపురం, ఓంకార్‌నగర్, మీలా ప్లాజా రెండో అంతస్తులో రవిందర్ గుప్తా అనే వ్యక్తి శ్రీసాయిదత్త డెవలపర్స్ పేరుతో రియల్ ఎస్టేట్ కార్యాలయం నిర్వహిస్తున్నాడు.
ఈనెల 10న రాత్రి 9 గంటల ప్రాంతంలో కార్యాలయాన్ని మూసివేసి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు దైవదర్శనానికి కుటుంబసభ్యులతో కలిసి తిరుపతికి వెళ్లాడు. శనివారం ఉదయం 6 గంటల సమయంలో రవిందర్ గుప్తాకు వాచ్మెన్ ఫోన్ చేసి రియల్ ఎస్టేట్ కార్యాలయం తాళాలు పగులగొట్టి ఉన్న విషయం తెలిపాడు. రవిందర్ గుప్తా విషయాన్ని తన సమీప బంధువు కందూరి సాయికి ఫోన్ ద్వారా చెప్పి, రియల్ ఎస్టేట్ కార్యాలయానికి వెళ్లాలని సూచించాడు.
ఘటనా స్థలానికి వెళ్లిన కందూరి సాయికి రియల్ ఎస్టేట్ కార్యాలయంలోని కప్‌బోర్డులు, టేబుల్ డ్రాయర్స్ ఓపెన్ చేసి ఉండడం గమనించి రవిందర్ గుప్తాకు తెలియజేశారు. లాకర్లో దాచిన రూ.4 లక్షలు, టేబుల్ డ్రాయర్లో దాచిన రూ.5 లక్షలు కలుపుకుని మొత్తం రూ.9 లక్షల నగదు, 10 తులాల బంగారం బిస్కెట్లు కనిపించలేదు. దొంగతనం విషయంపై కందూరి సాయి ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, సీఐ వినోద్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కందూరి సాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.