మన్సూరాబాద్, నవంబర్ 18: అబ్ధుల్లాపూర్ మెట్ పోలీస్‌స్టేషన్ పరిధి, బాటసింగారంలోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కళాశాలలో అక్టోబర్ 9 అర్ధరాత్రి జరిగిన భారీ నగదు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేయగా..ఓ మైనర్‌ను జువైనల్‌ను హోంకు తరలించారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ. 37.05 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ అనురాధ వివరాలు వెల్లడించారు.
గుజరాత్, వలసద్ జిల్లా, పిపరియా గ్రామానికి చెందిన దినేశ్ మొహితే (27), మధ్యప్రదేశ్, కర్గోన్ జిల్లా, రావర్కు చెందిన అరుణ్ మొహితే అలియాస్ కలు(18), గుజరాత్, వలసద్ జిల్లా, గోకుల్దామ్ ఉమర్గావ్కు చెందిన రాజ్‌మనోహర్ పవార్(22), మధ్యప్రదేశ్, కర్గోన్ జిల్లా, డొడ్వాన్కు చెందిన రితిక్ అలియాస్ రితిక్ మొహితే(24), మహారాష్ట్ర, నాసిక్ జిల్లా, మాలెగావ్‌కు చెందిన విలాస్ చౌహన్(22)తో పాటు ఓ జువైనల్(16) సమీప బంధువులు. దినేశ్ మొహితే, అరుణ్ మొహితే పాత నేరస్తులు. వారిద్దరు జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ వారిలో మార్పు రాలేదు. జల్సాలు చేసేందుకు దొంగతనాలు చేయాలని పథకం వేసుకున్నారు. అక్టోబర్ మొదటి వారంలో దినేశ్ మొహితే, అరుణ్ మొహితే, రాజ్‌మనోహర్ పవార్, రితిక్ మొహితే, విలాస్ చౌహాన్‌తో పాటు మైనర్లు కలుసుకున్నారు.
హైదరాబాద్‌కు వచ్చి ఇంజినీరింగ్ కళాశాలల్లో దొంగతనం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అక్టోబర్ 8న నగరానికి చేరుకున్నారు. నగర శివారుల్లో ఉండే ఇంజినీరింగ్ కాలేజ్‌ల వివరాలను గూగుల్ మ్యాప్‌లో శోధించారు. అక్టోబర్ 9 రాత్రి 9 గంటల సమయంలో నాగోల్‌లోని శ్రేయాస్ ఇంజినీరింగ్ కళాశాల వద్దకు చేరుకుని దొంగతనం చేయాలని చూశారు. సెక్యూరిటీ ఉండటంతో పాటు పరిసరాల్లో జనావా సాలు ఉండటంతో దొంగతనం చేయడం సాధ్యం కాలేదు. తిరిగి మరోసారి గూగుల్‌లో సెర్చ్ చేసి అర్ధరాత్రి వేళ బాటసింగారంలోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కళాశాల వద్దకు చేరుకున్నారు.
అడ్మిన్ బ్లాక్‌లోని ఐరన్ అల్మారాలోని రూ.1.07 కోట్ల నగదును అపహ రించుకుని అక్కడి నుంచి పరారయ్యారు. అక్టోబర్ 10న ఉదయం 8:45 కళాశాలకు వచ్చిన ప్రిన్సిపాల్ వీరన్నకు.. దొంగతనం జరిగిందని తెలిసి అబ్ధుల్లాపూర్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశా రు. ఈ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకోవడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. గుజరాత్, హర్యాన, మధ్యప్రదేశ్, కర్నాటక రాష్ర్టాల్లో పర్యటించిన పోలీసు బృందాలు నిందితుల వివరాలను సేకరిం చారు. దోపిడీకి పాల్పడిన నిందితులపై నిఘాపెట్టిన పోలీసులకు అబ్దుల్లాపూర్‌మెట్, కొత్తగూడ క్రాస్ రోడ్డులో మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా అటువైపుగా వచ్చిన రాజ్‌మనోహర్ పవార్, రితిక్ మొహితే, ఓ జువైనల్ ముగ్గురు అనుమానాస్పదంగా కనిపించారు.
వెంటనే వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా బ్రిలియంట్ కళాశాలలో జరిగిన దోపిడీ విషయం బయటపడింది. నిందితుల నుంచి రూ. 37.05 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. రాజ్‌మనోహర్ పవార్, రితిక్ మొహితేను రిమాండ్‌కు.. మైనర్‌ను జువైనల్‌ను హోంకు తరలించారు. మరో ముగ్గురు నిందితులు దినేశ్ మొహితే, అరుణ్ మొహితే, విలాస్ చౌహాన్ పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు బృందా లు ప్రయత్నిస్తున్నట్లు డీసీపీ అనురాధ తెలిపారు. ఈ సమావేశం లో ఎల్బీనగర్ జోన్ డీసీపీ క్రైమ్స్ వి.అరవింద్ బాబు, వనస్థలి పురం ఏసీపీ కాశిరెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ సీఐ అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.