సరిహద్దుల ప్రతిపాదిక లేదు.. హద్దులూ తెలియదు.. ఏ కాలనీ ఎక్కడ ఉందో స్పష్టత లేదు.. అడ్డగోలుగా ప్రాంతాలను విడదీసి ముక్కలు చేశారు.. ప్రజలకు అర్థం కాని రీతిలో డివిజన్ల హద్దులు చేపట్టారు. సలహాలు..సూచనలకు అవకాశమే ఇవ్వలేదు.. నిత్యం ప్రజల మధ్యే ఉండే ప్రజాప్రతినిధులకే అర్థంకానీ స్థితితో విపక్షాలే కాకుండా.. ఏకంగా అధికార పార్టీ నాయకులే విమర్శించే స్థాయిలో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టారు. దీంతో ప్రజలు, అన్ని పార్టీల నేతల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి. వార్డుల విభజన అశాస్త్రీయంగా జరిగాయంటూ గగ్గోలు పెట్టారు. అయినా బల్దియా అధికారుల తీరులో మార్పు రాలేదు. చివరకు జనాభా సంఖ్యతో పాటు వార్డుల వారీగా మ్యాపులను 24 గంటల్లోగా పబ్లిక్ డొమైన్లో పెట్టాలన్న న్యాయస్థానం ఆదేశించినా..బేఖాతరు చేశారు. మ్యాపులు, డివిజన్ జనాభా వివరాలు తెలిపేందుకు వెనుకడుగు వేశారు. ఓ ‘ముఖ్య’నేత ఆదేశానుసారం ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తుండగా, బల్దియా కమిషనర్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సిటీబ్యూరో, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): వార్డుల పునర్విభజన ప్రక్రియ ఏకపక్షంగానే కొనసాగుతున్నది.. మొదట్నుంచి అత్యంత గోప్యతను పాటిస్తూ వస్తున్న జీహెచ్ఎంసీ అరకొర సమచారంతో అందరినీ తప్పుదోవ పట్టించి చివరకు ప్రక్రియను గుట్టుగానే ముగించే దిశగా అడుగులు వేస్తున్నది.. అడ్డగోలుగా వార్డులుగా విభజించారంటూ ఇప్పటికే స్వపక్షం.. విపక్షం అని తేడా లేకుండా ముక్తకంఠంతో ఖండించారు. చివరకు జనాభా సంఖ్యతో పాటు వార్డుల వారీగా మ్యాపులను 24 గంటల్లోపు పబ్లిక్ డొమైన్లో పెట్టి వార్డుల పునర్విభజనను పారదర్శకంగా చేపట్టాలని న్యాయస్థానం జీహెచ్ఎంసీని ఆదేశించింది.. కానీ అధికారులు న్యా యస్థానం ఆదేశాలను బేఖాతరు చేశారు.
గురువారం జనాభా, మ్యా పులను పబ్లిక్ డొమైన్‌లోకి పెట్టలేదు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్, అదనపు కమిషనర్లు, టౌన్‌ప్లానింగ్ ఉన్నతాధికారుల బృందం సీజీజీలోనే మకాం వేశారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తీవ్ర కసరత్తు చేశారు.గురువారం సాయంత్రం 4 తర్వాత జనాభా, మ్యాపుల ప్రదర్శనతో అసలు గుట్టు బయటపడుతుందని భావించిన అధికారులు.. పై నుంచి వచ్చిన ఆదేశాలనుసారం కమిషనర్ కర్ణన్ యూటర్న్ తీసుకున్నట్లు తెలిసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ వేసేందుకే సిద్ధమయ్యారే తప్ప పబ్లిక్ డొమైన్‌లోకి మ్యాపులు, జనాభా వివరాలను తెలిపేందుకు సిద్ధంగా లేరని తెలిసింది.
అన్నీ అనుమానాలే!
ఆగమేఘాల మీద జీహెచ్ఎంసీలోకి 27 పురపాలికలను విలీనం చేసుకుని..అంతే హరిబరిగా 150 డివిజన్లను 300 డివిజన్లుగా మార్చేసి ఈ నెల 9న ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. డివిజన్ల కనీస సమాచారం లేకుండా మొక్కుబడిగా బౌండరీలు, సర్వేనంబర్ల పేరుతో అభ్యంతరాలు చేపట్టాలంటూ వారం రోజుల వ్యవధి సమయాన్ని ఇచ్చింది. తూతూ మంత్రంగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినా..అందులో అధికార పార్టీ, విపక్ష పార్టీల సభ్యులంతా అడ్డగోలుగా విభజన చేసిన పునర్విభజనను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసినా.. అధికారులు మాత్రం యాక్ట్‌ను పక్కాగా అమలు చేస్తున్నామని చెబుతూ ఏకపక్షంగానే నిర్ణయాలను ఆమలు చేస్తుండడం విస్మయానికి గురి చేస్తున్నది.
యాక్ట్ తీసుకువచ్చిన సమయంలో పరిధి చిన్నగా ఉండడం, బౌండరీలు, సర్వే నంబర్లు ఈజీగా గుర్తు పట్టే అవకాశం ఉండేది..కానీ ఇప్పుడు 650 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం కాస్తా విలీనం తర్వాత 2053 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించింది. ఐతే 300 వార్డులుగా విభజించిన అధికారులు బౌండరీలు, సర్వే నంబర్లతో ముందుకు వెళ్తున్నారు. ఐతే ప్రస్తుతం డివిజన్లో ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేటర్‌కే అర్థం కాకుండా డీ లిమిటేషన్ చేసిన తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. న్యాయస్థానం సైతం పారదర్శకంగా చేపట్టాలని సూచించినా..ప్రజల కోణంలో అలోచించకుండా గుట్టుచప్పుడు కాకుండా ముగించాలన్న ధోరణిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చారిత్రక హైదరాబాద్ నగరంపై ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న సర్కారు…ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి విరుద్దంగా ఏకపక్షంగా వ్యవహరిస్తుండడం పట్ల అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్న పరిస్థితి.
తప్పిదాలు వెలుగులోకి వస్తాయనే
ఇప్పటి వరకు ఎక్కువగా వార్డుల పేర్లు మారాయని, వార్డు పేరుతో ఉన్న ప్రాంతాలు ఆ డివిజన్లో కాకుండా పక్క డివిజన్లలోకి చేర్చారని, బౌండరీలు సరిగ్గా లేవని, బౌండరీల హద్దులు ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదని, జనాభాలో వ్యత్యాసాలు ఉన్నాయని, ఇప్పటి వరకు ఉన్న వార్డులను రెండు, మూడు, నాలుగు ముక్కలుగా చేసి విభజించారన్న అంశాలపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. ఐతే వార్డుల జనాభా, మ్యాపుల ప్రదర్శనల ద్వారా అధికారుల తప్పిదాలు వెలుగులోకి వస్తాయనే కారణాలతోనే గుట్టుగా ముగించాలని భావించారు. జీహెచ్ఎంసీ యాక్ట్ ఒకవైపు, మరోవైపు, జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియను డిసెంబర్ చివరికి పూర్తి చేస్తే రాబోయే జనగణనకు ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వ సూచనను పరిగణనలోకి తీసుకుని హడావుడిగా అడుగులు వేశారన్న చర్చ జరుగుతున్నది.
కొనసాగుతున్న ఆందోళనలు
వార్డులోని ఓటర్ల సంఖ్య, భౌగోళిక స్వరూపం, సరిహద్దులను సమన్వయం చేసుకుని చేపట్టాల్సిన వార్డుల విభజనలో శాస్త్రీయత ఏ మాత్రం పాటించలేదని, వార్డుల జనాభాలో వ్యత్యాసాలు ఉన్నాయని, డివిజన్లను అర్థంపర్థం లేకుండా ముక్కలు ముక్కలుగా విభజించారని, ఇంత హడవుడిగా విలీనం, వికేంద్రీకరణ ప్రక్రియను చేపట్టాల్సిన అవసరం ఏం వచ్చిందంటూ భగ్గుమన్నారు. బుధవారం వరకు 5905 మంది నుంచి అభ్యంతరాలు స్వీకరించిన గురువారం 10కి పైగా దరఖాస్తులు వచ్చాయి.
ఐతే ఈ అభ్యంతరాల స్వీకరణలోనూ అనేక అనుమానాలు లేకపోలేదు..ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదుదారులు వచ్చిన రికార్డులో నామమాత్రంగా చూపించినట్లు ప్రచారం సాగుతున్నది.. శుక్రవారం సైతం నామమాత్రంగానే అభ్యంతరాలను స్వీకరించి ప్రాథమిక నోటిఫికేషన్ ప్రక్రియను ముగించే పనిలో జీహెచ్ఎంసీ ఉండడం గమనార్హం. ఐతే స్వీకరించిన అభ్యంతరాలను సైతం ఏ మేర పరిగణనలోకి తీసుకుంటారన్న అంశంపై విస్తృత చర్చ జరుగుతున్నది.