మేడ్చల్, ఫిబ్రవరి2(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం దూకుడుగా కొనసాగుతున్నది. నామినేషన్లకు ముందు నుంచే అభ్యర్థుల ఎంపికలో స్పష్టత ఉన్న నేపథ్యంలో ప్రచారంలో బీఆర్ఎస్ జోరు పెంచింది. అంతేకాకుండా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి వలసలు అలాగే కొనసాగుతున్నాయి. వివిధ పార్టీల నుంచి వస్తున్న వలసల కారణంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం మరింత రెట్టింపయింది.
ఎల్లంపేట, అలియాబాద్, మూడుచింతలపల్లి మున్సిపాలిటీల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ప్రచారం ప్రజలను విశేషంగా అకట్టుకుంటున్నది. మూడు మున్సిపాలిటీల్లో చేస్తున్న ప్రచారంతో బీఆర్ఎస్ వైపు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు అకర్షితులవుతున్నారు. దీంతో మూడు మున్సిపాలిటీల పరిధిలోని కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతున్నారు.
బీఆర్ఎస్ గెలుపు ఖాయం
మేడ్చల్ రూరల్, ఫిబ్రవరి 2: మున్సిపల్ ఎన్నికల్లో నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎల్లంపేట మున్సిపాలిటీలోని మైసిరెడ్డిపల్లి, డబిల్పూర్ గ్రామాల్లో సోమవారం ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను విస్మరించిందన్నారు. కారుగుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ బీఆర్ఎస్ ఇన్చార్జ్ మహేందర్‌రెడ్డి, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ వెంకట్‌రెడ్డి, మేడ్చల్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్, నాయకులు.. రాజమల్లారెడ్డి, భాగ్యరెడ్డి, నవీన్‌రెడ్డి, రఘుపతిరెడ్డి, అశోక్, శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు.
మల్లన్న ఆశీస్సులు బీఆర్ఎస్కే..
శామీర్‌పేట, ఫిబ్రవరి 2: మల్లన్న ఆశీస్సులతో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయదుందుభి మోగించడం ఖాయమని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. లాల్‌గడి మలక్‌పేటలో నిర్వహించిన మల్లికార్జున స్వామి జాతరలో సోమవారం ఆయన పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మల్లారెడ్డి మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశలను పూర్తిగా నిరాశపరిచిందని తీవ్రంగా మండిపడ్డారు. అలియాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేసేలా మల్లన్న స్వామి ఆశీస్సులు అందించాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు అభ్యర్థి అలా భారతి లక్ష్మిరెడ్డి, 15వ వార్డు అభ్యర్థి నేమురి ఇందిరా, నేమురి నగేశ్, 16వ వార్డు అభ్యర్థి చీదు వనజా శ్రీనివాస్ రెడ్డి, 6వ వార్డు అభ్యర్థి తలారి కృష్ణ, 14వ వార్డు అభ్యర్థి బండి శ్యామల రవి తదితరులు పాల్గొన్నారు.
మల్లన్న రూటే.. సపరేట్
మేడ్చల్, ఫిబ్రవరి 2: మల్లన్న రూటే సపరేట్. ఆయన పూలు అమ్మినా, పాలమ్మినా అన్నా, నేను హ్యాట్రిక్ మల్లారెడ్డి అన్నా నవ్వుల పూలు పూయాల్సిందే. ఎక్కడికి వెళ్లినా తనకుంటూ ఒక ప్రత్యేకతను చాటుకుని, నిత్యం వార్తల్లో నిలుస్తారు. మూడుచింతపల్లి మున్సిపాలిటీలోని.. జగన్‌గూడ, ఉద్దెమర్రి గ్రామాల్లో మల్లన్న కల్యాణానికి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డోల్ వాయించి, మున్సిపాలిటీల్లో ఎన్నికల్లో విజయ దుంధుబి మోగిస్తామన్న సంకేతం ఇచ్చారు. తినుబండరాల దుకాణానికి వెళ్లి జిలేబీ తింటూ ఓటు అభ్యర్థించారు. మల్లారెడ్డి వినూత్న ప్రచారంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతున్నాయి.
బీఆర్ఎస్లో చేరికలు
మేడ్చల్ రూరల్, ఫిబ్రవరి 2: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై నమ్మకంతో ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ఎల్లంపేట మున్సిపాలిటీలోని శ్రీరంగవరం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నేతలు 15 మంది మల్లారెడ్డి సమక్ష్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేసేవారకి తగిని గుర్తింపు ఇస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీలో చేరినవారిలో కిష్టాపూర్ నాగరాజు, అమీర్, రమేష్, దాది నాగరాజు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సురేందర్ ముదిరాజ్, నాయకులు.. కృష్ణ, సుశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.