రవీంద్రభారతి, డిసెంబర్ 29: రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రాచీన సాంప్రదాయ కళలను, కళాకారులను పరిరక్షించుకోవాలని సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ చెప్పారు. బుధవారం రవీంద్రభారతిలో గుమ్మడి గోపాలకృష్ణ ఫౌండేషన్- శ్రీ సత్యాసాయి కళానికేతన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏఆర్ కృష్ణ స్మారక నాటకోత్సవాలు 3వ రోజు ఘనంగా కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ విచ్చేసి మాట్లాడుతూ ఎన్నో నంది అవార్డులను స్వీకరించిన గుమ్మడి గోపాలకృష్ణ పేద కళాకారులకు ఆర్థిక సాయం చేయడం అభినందనీయమన్నారు. అంతకుముందు సుమిత్రయూత్ అసోసియేషన్ మధిర వారు సమర్పించు కవిబ్రహ్మ తిక్కన సోమయాజి పద్యనాటకం ఎంతగానో ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమంలో సమన్వకర్త సతీష్ఉప్పాల, గుమ్మడి గోపాలకృష్ణ, ముట్నూరి శివశంకరశాస్త్రి, డా.నిభానుపూడి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.