మియాపూర్, మే 5: సాధారణ బదిలీలేవీ లేనప్పటికీ అంతర్గతంగా ఓ అధికారి బదిలీ ప్రస్తుతం శేరిలింగంపల్లి జోన్లో చర్చనీయాంశంగా మారింది. కొద్దిరోజుల క్రితమే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శేరిలింగంపల్లి జోన్లో పట్టణ ప్రణాళికా విభాగంలో బదిలీల ప్రక్రియ ముగిసి అధికారులు తమ నూతన స్థానాలలో విధుల నిర్వహణలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ బదిలీ అయిన ఒకటి రెండు రోజులలో జోన్ పరిధిలోని ఓ సర్కిల్‌కు చెందిన పట్టణ ప్రణాళికా విభాగం అధికారికి గుట్టుచప్పుడు కాకుండా రాత్రికిరాత్రే బదిలీ ఆర్డర్ జారీ అయ్యింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ అధికారి బదిలీ అయిన స్థానంలో విధులలో చేరాడు.
ఇదివరకే ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న అధికారిని తాను చేస్తున్న సర్కిల్‌కు పంపేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే సదరు సర్కిల్ అధికారులు మాత్రం పట్టణ ప్రణాళికా విభాగం అధికారిని రిలీవ్ చేసేందుకు ససేమిరా అంటున్నారు. అతి త్వరలో జనగణన లెక్కల సేకరణ చేపట్టనుండటంతో అందుకు సంబంధించిన శిక్షణ సైతం పూర్తయిన నేపథ్యంలో.. కీలకమైన ఈ విధులను నిర్వర్తించాల్సిన సమయంలో ఆ బదిలీ ఆర్డర్ జారీకావటం ఏమిటని విస్మయం వ్యక్తం చేసారు. అయితే బదిలీ ఆర్డర్ పొందిన అధికారి బదిలీ స్థానంలోకి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు ఏమాత్రం సఫలం కాకుండా పూర్వపు అధికారులు విసిరిన పాచికలు పారాయి. అధికార, రాజకీయ జోక్యంతో ఎట్టకేలకు సదరు అధికారి బదిలీ ఆర్డర్‌ను సైతం రద్దు చేయించారు. దీంతో బదిలీపై వెళ్లాలనుకున్న ఆ అధికారి తీవ్ర నిరాశకు గురై, తనకు అడ్డంపడ్డారంటూ ప్రస్తుతం పనిచేస్తున్న సర్కిల్ అధికారులపై రుసరుసలాడినట్లు విశ్వసనీయ సమాచారం.
ఆ నోటా ఈ నోటా ఈ ఆకస్మిక బదిలీ అంశం సీఎంసీ కమిషనర్ దృష్టికి వెళ్లింది. దీంతో సాధారణ బదిలీలేవి లేని ఈ సమయంలో ఆ ఒక్క అధికారికి బదిలీ ఆర్డర్ ఎలా జారీ అయ్యిందనే అంశంపై లోతైన విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. దీనిపై నివేదికను అందించాలని జోనల్ పట్టణ ప్రణాళిక ఉన్నతాధికారికి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. అయితే జోన్ పరిధిలోని ఒకరిద్దరు తీవ్ర స్థాయిలో శ్రమించి సదరు అధికారికి గుట్టుచప్పుడు కాకుండా బదిలీ ఆర్డర్ ఇప్పించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారంలో కొంతమొత్తంలో చేతులు మారినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం షాట్ సర్క్యూట్ కారణంగా శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని పలు కీలకమైన కంప్యూటర్లు సైతం కాలిపోగా.. బదిలీ ఆధారాలు బయటపడే అవకాశం లేదనే విశ్వాసంతో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఈ అంశంపై ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్‌కు చెందిన అధికారులను సీఎంసీ ఉన్నతాధికారులు తీవ్రస్థాయిలో మందలించినట్లు తెలుస్తున్నది.