చార్మినార్, అక్టోబర్ 4 : రహదారి విస్తరణ కష్టాలకు ఓ ఆలయం పరిష్కారం చూపింది. జూ పార్క్ నుంచి ఆరాంఘర్ క్రాస్ రోడ్డు వరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు చకచకా జరుగుతున్నాయి. అయితే తాడ్బన్ సమీపంలోని మోచీ కాలనీ వద్ద వెలిసిన దండు మారమ్మ దేవాలయం రోడ్డు విస్తరణలో భాగంగా ఫ్లై ఓవర్ కింద వస్తున్నట్లు బస్తీ దేవాలయ కమిటీ సభ్యులు, జీహెచ్ఎంసీ, ప్రాజెక్ట్ అధికారులు గుర్తించారు. దీంతో ఆలయాన్ని మరో ప్రాంతానికి తరలించడానికి అధికారులు చర్యలు చేపట్టారు.
ప్రస్తుతం ఆలయం ఉన్న 90 గజాల స్థలానికి అదనంగా 145 గజాల స్థలంతోపాటు ఆలయ నిర్మాణానికి దేవాదాయశాఖ నుంచి రూ. 67 లక్షలు అందిస్తామని అధికారులు ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులకు తెలియజేశారు. అందరి అంగీకారంతో రెండు నెలల్లో ఆలయాన్ని మరో చోట నిర్మిస్తామని దేవాదాయశాఖ డిప్యూటీ ఈవో బాలాజీ తెలిపారు. కొత్త ఆలయం వస్తున్నందున రోడ్డు విస్తరణకు పూర్తిగా సహకరిస్తామని ఆలయ కమిటీ సభ్యులు ఆర్. ధన్రాజ్, పెరుగు శ్రీనివాస్, సింధి స్వామి, స్థానికులు తెలిపారు.