HomeHyderabadThe Telangana Govt Is Dragging Its Feet Regarding The Banjara Hills Lands
కోర్టు ఆదేశాల పేరిట హెచ్ఎండీఏ మెలిక
బంజారాహిల్స్ భూముల విషయంలో సర్కారు మీనమేషాలు లెక్కిస్తున్నది. వేల కోట్లపై ఆశతో పర్యావరణహితమైన ప్రాంతాన్ని కాంక్రీట్ జంగిల్‌గా మార్చి సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. ఓవైపు హెచ్ఎండీఏ వేలానికి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనలు చేస్తుంటే... కోర్టు ఆదేశాల పేరిట అధికారులు మెలిక పెడుతూ వేలానికి సిద్ధమవుతున్నారు.
బంజారాహిల్స్ ఎకో పార్క్‌పై మీనమేషాలు
కోర్టు ఉత్తర్వులతో సంబంధం లేకుండానే వేలానికి సన్నాహాలు
సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ) : బంజారాహిల్స్ భూముల విషయంలో సర్కారు మీనమేషాలు లెక్కిస్తున్నది. వేల కోట్లపై ఆశతో పర్యావరణహితమైన ప్రాంతాన్ని కాంక్రీట్ జంగిల్‌గా మార్చి సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. ఓవైపు హెచ్ఎండీఏ వేలానికి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనలు చేస్తుంటే… కోర్టు ఆదేశాల పేరిట అధికారులు మెలిక పెడుతూ వేలానికి సిద్ధమవుతున్నారు. బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 12లోని 8.24 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయడానికి వీల్లేదనీ స్థానికులు అడ్డుపడుతున్నా… ఆదేశాలతో సంబంధం లేకుండానే వేలానికి చర్యలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తున్నది.
రాకెట్ వేగంతో చుట్టూ విస్తరిస్తున్న కాంక్రీట్ జంగిల్‌లాంటి కీలకమైన ప్రాంతంలో పచ్చదనం కోరుకునే నగరవాసుల ఆశలకు విలువే లేకుండా పోయింది. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారమే లక్ష్యంగా సర్కారు పచ్చని ప్రాంతాలను కనుమరుగు చేస్తూనే ఉంది. హెచ్ఎండీఏ బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 12లో వేలానికి రెండు నెలల కిందటే సిద్ధం చేసింది. అయితే కోర్టు వివాదాలతో ఈ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచింది. కానీ కోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా ఆ భూముల వేలానికి ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిసింది. జూలై 13న హైకోర్టు కమిటీ నివేదిక ఆధారంగా పనులు చేపట్టాల్సి ఉండగా… కమిటీ నివేదిక కొంత జాప్యం జరిగింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న ప్రైవేటు భూ యజమానులతో ఉన్న భూ వివాదాన్ని పక్కన పెట్టి, మిగిలిన భూములను వేలం వేసి సొమ్ము చేసుకునేలా ఏర్పాటు చేస్తుంది.
హామీలు బుట్టదాఖలు
ప్రభుత్వానికి చెందిన ఈ భూమిని స్వాధీనం చేసుకున్న సమయంలో జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, అప్పటి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఈ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించి ఎకో పార్క్‌గా డెవలప్ చేస్తామని ఇచ్చిన హామీ బుట్టదాఖలైంది. ప్రకటన చేసి 12 నెలలు గడవకముందే ఈ దట్టమైన వన సంపద కలిగిన ప్రాంతాన్ని వేలం వేసేందుకు సిద్ధమైంది. కానీ ప్రస్తుతం ఆ భూములను ఎకో పార్క్‌గా అభివృద్ధి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నా… సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదు.