ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ నిర్విరామంగా కొనసాగుతున్నది. రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా సేవలందిస్తుండటంతో నిరుపేదల్లో సరికొత్త కాంతులు నింపుతున్నది. ఉదయం నుంచే శిబిరాల వద్ద బారులు తీరుతున్నారు. సోమవారం సైతం విశేష స్పందన వచ్చింది. వివిధ సమస్యలతో శిబిరాలకు వచ్చిన వారు పరీక్షలు చేయించుకొని.. మందులతో పాటు కండ్లద్దాలు అందుకొని.. సంతోషం వ్యక్తం చేశా రు. సర్కారు సల్లంగుండాలంటూ.. దీవెనలు అందించారు.
సిటీబ్యూరో, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తున్నది. కంటి సమస్యలు ఉన్న వారు తమ వంతు బాధ్యతగా గ్రేటర్లో ఏర్పాటు చేసిన కేంద్రాలకు స్వచ్ఛందంగా వెళ్లి పరీక్షలు చేసుకుంటున్నారు. సోమవారం గ్రేటర్ వ్యాప్తంగా మొత్తం 274 కేంద్రాల్లో 56,335 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 19,539 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా, 11,068 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు.

నగరంలో సోమవారం 115 కేంద్రాల్లో 15,265 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి వెల్లడించారు. వారిలో 4,039 మందికి రీడింగ్ గ్లాసెస్‌ను పంపిణీ చేశారు. 3,118 మంది రోగులకు ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్‌ను సిఫారసు చేశారు.
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా 80 కేంద్రాల ద్వారా 15,544 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 5,950 మందికి కంటి అద్దాలు పంపిణీ చేయగా, 2939 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేశారు.
మేడ్చల్ జిల్లా పరిధిలో 79 కేంద్రాల ద్వారా సోమవారం వరకు 25,526 మందికి కంటి పరీక్షలను వైద్య బృందాలు నిర్వహించాయి. ఇందులో 9,550 మందికి రీడింగ్ కండ్లద్దాలను అందించగా, 5,011 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేశారు.
మేడ్చల్, జనవరి23 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అలియాబాద్‌లో జరిగిన కంటి వెలుగు పరీక్ష శిబిరాన్ని సోమవారం మంత్రి మల్లారెడ్డి సందర్శించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలలో ప్రజలందరూ కంటి పరీక్షలు నిర్వహించుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో 79 బృందాలు కంటి వెలుగు పరీక్షలు నిర్వహిస్తుండగా 3 వార్డులు, ఒక గ్రామంలో కంటి పరీక్షలు పూర్తయినట్లు జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్ వెల్లడించారు.