సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ) : భారతీయ సాంప్రదాయ వైద్యమైన ఆయుష్‌పై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఒక పక్క అలోపతి వైద్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో బలోపేతం చేస్తూనే.. మరో పక్క దేశీయ వైద్యానికి సైతం పెద్దపీట వేస్తున్నది. ఈ క్రమంలోనే ఆయుష్‌లోని హోమియో, యునాని, హోమియో విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా హోమియో విభాగానికి 33మంది కొత్త వైద్యులను నియమించేందుకు నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. అయితే 33మంది కొత్త వైద్యులు అందుబాటులోకి వస్తే హోమియో వైద్య సేవలు మరింత బలోపేతం కావడంతో పాటు అలోపతి వైద్యానికి సమాంతరంగా హోమియో సేవలు కూడా ప్రజలకు చేరువ కానున్నట్లు నిపుణులు చెబుతున్నారు. హోమియో వైద్యానికి నాటి నుంచి నేటి వరకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు, సీజనల్, ప్రసూతి సమస్యలు, కీళ్ళ నొప్పులు తదితర అన్ని రకాల సమస్యలకు హోమియోలో చికిత్స అందుబాటులో ఉండడమే కాకుండా వ్యాధి మూలాలపై పనిచేసి, పునరావృతం కాకుండా చేయడమే హోమియో ప్రత్యేకతగా చెబుతున్నారు.
94కు పెరగనున్న హోమియో డిస్పెన్సరీలు
ప్రస్తుతం ఆయుష్ పరిధిలో మొత్తం 61 హోమియో డిస్పెన్సరీలు ప్రజలకు అందుబాటులో ఉన్నట్లు హోమి యో వైద్య కళాశాల ప్రిన్సిపాల్, అదనపు డైరెక్టర్ డాక్టర్ లింగరాజు తెలిపారు. కొత్తగా 33మంది హోమియా వైద్యులు అందుబాటులోకి వస్తే డిస్పెన్సరీల సంఖ్య 94కు పెరగనున్నట్లు తెలిపారు. పురాతనమైన హోమియా వైద్యానికి ప్రజల నుంచి విశేష స్పందన ఉండడంతో ప్రభుత్వం కూడా ఆ దిశలోనే ఆయుష్ బలోపేతానికి చర్యలు చేపడుతున్నది.
ప్రజలకు మరింత చేరువగా హోమియో సేవలు
హోమియో వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే ఆయుష్‌లో కొత్త నియామకాలకు చర్యలు తీసుకుంది. హోమియో విభాగంలో 33మంది కొత్త వైద్యులు రిక్రూట్ కానున్నారు. ప్రస్తుతం ఉన్న 61మంది రెగ్యులర్ వైద్యులు, ఎన్ఆర్హెచ్ఎం కింద మరో 105మంది వైద్యులు అందుబాటులో ఉన్నారు. కొత్తగా జరిగే నియామకాలతో మరో 33మంది రెగ్యులర్ వైద్యులు అందుబాటులోకి రానున్నారు. దీంతో హోమియోలో రెగ్యులర్ వైద్యుల సంఖ్య 94కు చేరనున్నది. దీంతో డిస్పెన్సరీల సంఖ్య కూడా 94కు చేరి, హోమియో సేవలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 50 బెడెడ్ ఆయుష్ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్స్ అందుబాటులోకి రానున్నాయి. సిద్దిపేట, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లిలో ఈ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్స్‌కు సంబంధించిన నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వీటిలో హోమియోతో పాటు ఆయుర్వేద, నేచురోపతి, యునాని సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.
– డాక్టర్ లింగరాజు, ప్రిన్సిపాల్, హోమియో వైద్యకళాశాల