సిటీబ్యూరో, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): నగరంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దక్షిణ దిశ నుంచి వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో నగరంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించి నమోదవుతున్నాయి. ఫలితంగా ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం సమయానికి అగ్నిగుండాన్ని తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు అత్యవసరముంటే తప్ప.. బయటకు రావడం లేదు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు సిటీలో గరిష్ఠం 40.3, కనిష్ఠం 26.4 డిగ్రీ సెల్సియస్, గాలిలో తేమ 21శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.