శివారుల్లో నకిలీ పత్రాలు, వ్యక్తులను సృష్టించి ఖాళీ జాగలను మాయం చేసిన ముఠాలకు సబ్‌రిజిస్ట్రార్ వెన్నుదన్నుగా నిలిచారు. ఆయనపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకంజ వేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సబ్‌రిజిస్ట్రార్ వ్యవహారం కీసర పోలీసుల దర్యాప్తులో వెల్లడవ్వడంతో అరెస్ట్ చేసేందుకు అనుమతి కావాలంటూ పోలీసులు ప్రభుత్వానికి లేఖ రాశారు. రోజులు గడుస్తున్నా అనుమతి మాత్రం రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
-సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): 30 ఏండ్ల క్రితం కీసర మండలంలో ప్లాట్లను కొనుగోలు చేసిన యజమానులు వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్నారు. ప్లాట్లకు నకిలీ పత్రాలు తయారు చేసి..తామే యజమానులమంటూ నకిలీ వ్యక్తులను సృష్టించి… సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆ ప్లాట్లను ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారు. ఇలాంటి ఘటనలపై అసలైన యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయా కేసులపై దర్యాప్తు చేశారు.
ఈ ముఠాల వెనుక ఉన్నదెవరంటూ లోతైన దర్యాప్తు చేయడంతో.. అప్పట్లో సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేసిన రెహమాన్ అనే అధికారి సహకారంతో ఇదంతా జరిగినట్లు దర్యాప్తులో తేలింది. సబ్‌రిజిస్ట్రార్ సహకారం ఉండడంతో ఈ నకిలీ ముఠాలు చెలరేగిపోయాయని, రూ. 100 కోట్లకుపైగా విలువైన ప్లాట్లకు నకిలీ పత్రాలు, వ్యక్తులను తయారు చేసి విక్రయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులకు ఇప్పటి వరకు 10 ఫిర్యాదుల వరకు రావడంతో ఆయా కేసుల్లో నిందితులను అరెస్ట్ చేశారు.
నకిలీ డాక్యుమెంట్లతో కబ్జా..
ఖాళీ ప్లాట్లకు నకిలీ డాక్యుమెంట్లు, వ్యక్తులతో కబ్జాల పర్వం కొనసాగించిన ముఠాల నుంచి సబ్‌రిజిస్ట్రార్, ఆయన అనుచరులు రూ. 3 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గత నెలలో కీసర పోలీసులు డాక్యుమెంట్ రైటర్ ఉదయ్రెడ్డితో పాటు జంగాల శ్రీరామ్, గుబ్బల వెంకటేశ్వర్రావు అలియాస్ జీవీఆర్, బందెల్ల ప్రశాంత్ అలియాస్ బాబి, బందెల్ల ప్రభాకర్, పొన్నబోయిన బాలకృష్ణ అలియాస్ బాలులను అరెస్ట్ చేశారు.
ఈ కేసులో 300 గజాల ప్లాట్‌కు నకిలీ డాక్యుమెంట్ తయారు చేసి నకిలీ వ్యక్తులతో మరొకరికి ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేసి, దాని నుంచి ఇతరులకు ఈ ముఠా రిజిస్ట్రేషన్ చేసింది. అసలైన ప్లాట్ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తరుచూ ఇలాంటి ఫిర్యాదులు వస్తుండడంతో అమ్మకాలు, కొనుగోలు చేసిన వ్యక్తులపైనే దృష్టి సారించిన పోలీసులు, అధికారుల సహకారం లేకుండా ఎలా జరిగిందనే కోణంలోను దర్యాప్తు చేశారు.
ఈ దర్యాప్తులో డాక్యుమెంట్ రైటర్ పాత్రతో పాటు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది సహకారం ఉన్న ట్లు బయటపడింది. దీంతో సబ్‌రిజిస్ట్రార్ రహమాన్ హయాంలోను ఎక్కువగా ఈ నకిలీ డాక్యుమెంట్లు జరిగినట్లు దర్యాప్తులో బయటపడటంతో పోలీసులు సైతం విస్తుపోయారు. ప్రస్తుతం సదరు సబ్‌రిజిస్ట్రార్ మరో ప్రాంతం లో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే నేరుగా అరెస్ట్ చేయకుండా ప్రభుత్వ అనుమతి తీసుకొని తదుపరి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు భావించారు. ఈ నేపథ్యంలోనే సబ్‌రిజిస్ట్రార్ రెహమాన్ పాత్ర నిర్ధారణ అయ్యిందని, తదుపరి చర్యలు తీసుకోవడం కోసం తమకు అనుమతి ఇవ్వాలం టూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగానికి లేఖ రాశారు. రోజులు గడుస్తున్నా ఈ విషయంపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగం నుంచి స్పందన లేకపోవడంతో పోలీసులు కూడా ఆ కేసును పక్కన పెట్టినట్లు సమాచారం.
ప్రభుత్వ పెద్దలతో ఒత్తిళ్లు..
తనపై చర్యలు తీసుకోకుండా ఉండేలా సదరు సబ్‌రిజిస్ట్రార్ అధికారులను, రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్లు తీసుకురావడంతోనే పోలీసుల లేఖకు స్పందన రావడం లేదనే విమర్శలు సైతం విన్పిస్తున్నాయి. ఇటీవల మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రెవెన్యూ అధికారులు వరుసగా ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారు, మరికొందరు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో అరెస్టయ్యారు. సామాన్య ప్రజలు కష్టపడి కొనుగోలు చేసిన ప్లాట్లను కొట్టేసే నేరగాళ్ల ముఠాలకు సహకారం అందించిన సబ్‌రిజిస్ట్రార్‌ను ప్రభుత్వం కాపాడడంలో అంతర్యమేమి అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
పోలీసులు ఇలాంటి కేసులను మరింత లోతుగా దర్యాప్తు చేయాలంటూ ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం నేర ముఠాలకు సహకరించిన వారిపై చర్యలు తీసుకోకుండా అడ్డుకోవడం ఏంటంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సబ్‌రిజిస్ట్రార్‌ను పోలీసులు విచారిస్తే, కేవలం ఈ ముఠాలకు సహకారం అతడితోనే ఆగిపోయిందా? ఉన్నతాధికారులు కూడా సహకరించారా? అనే విషయం కూడా బయటకు వచ్చే అవకాశాలున్నాయంటూ సామాన్య ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇదిలాఉండగా ఈ విషయంపై మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్‌ను ’నమస్తే తెలంగాణ’ సంప్రదించగా… వారం పది రోజుల్లో ప్రభుత్వం నుంచి అనుమతి రావచ్చని అనుకుంటున్నామని తెలిపారు.