దుండిగల్, ఏప్రిల్ 20: ఔటర్‌పై ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఒడిశా రాష్ట్రం జైపూర్ కు చెందిన గిర్ధుడు భాను ప్రకాశ్(36), అదే రాష్ట్రం రౌర్కెల కు చెందిన నళిని(37) స్నేహితులు. నగరంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తూ మంచిరేవులలో ఉంటున్నారు.
ఆదివారం తెల్లవారుజామున కారులో మేడ్చల్ నుంచి పటాన్‌చెరూ వైపు వెళ్తున్నారు. వేగంగా ప్రయాణిస్తుండడంతో మల్లంపేట ఓఆర్ఆర్ వద్ద వీరి కారు అదుపు తప్పింది. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. భాను ప్రకాశ్, నళిని అక్కడికక్కడే చనిపోయారు. మితిమీరిన వేగం,అజాగ్రత్తగా వాహనం నడపడం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.