సిటీబ్యూరో, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): భాగ్యనగరంలో గాలి నాణ్యత రికార్డు స్థాయిలో క్షీణిస్తున్నది. విశ్వనగరాన్ని దుమ్ము, ధూళి కమ్మేస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కలుషితమైన గాలితో నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న వాహనాల నుంచి వెలువడే పొగ, ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా వేస్తున్న చెత్త, గృహ వ్యర్థాల నుంచి వస్తున్న దుర్వాసనతో తీవ్ర అవస్థలు పడుతున్నారు.
దీనికి తోడు గత కొద్దిరోజులుగా నగరంతో పాటు శివారు ప్రాంతాలైన పారిశ్రామికవాడల్లోనూ చలి తీవ్రత పెరగడంతో గాలి నాణ్యత క్రమక్రమంగా క్షీణిస్తున్నది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ప్రమాదకరమైన పీఎం-10, పీఎం-2.5 ధూళి కణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటి ప్రభావంత అంతకంతకూ పెరగడంతో నగరవాసులు ఊపిరి పీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కలుషిత గాలిని పీలుస్తూ శ్వాసకోశ, నాడీ సంబంధ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. వ్యాధిగ్రస్తులు, వృద్ధులు చెడుగాలిని పీల్చడం వల్ల మరింత అనారోగ్యానికి గురవుతున్నారు.
సోమాజిగూడలో 231 పాయింట్లకు పీఎం-2.5 ధూళికణాలు
ప్రమాదకర పీఎం-2.5 ధూళికణాలు మునుపెన్నడూ లేనంతగా విజృంభిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రధాన ప్రాంతాల్లో పీఎం-2.5, పీఎం-10 ధూళికణాల తీవ్రత రోజురోజుకు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నది. ధూళి కణాల తీవ్రత సాధారణంగా వంద కంటే తక్కువగా ఉంటే పెద్దగా ప్రమాదం ఉండదు. శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడేవారికి మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. కానీ వాటి స్థాయిలు వంద కంటే ఎక్కువగా పెరిగితే ఆరోగ్యవంతమైన వారిపైన కూడా తీవ్ర ప్రభావం చూపిస్తాయి. నగరంలోని సోమాజిగూడ పరిధిలో అత్యధికంగా రికార్డు స్థాయిలో 231 పాయింట్లకు చేరుకున్నది.
పీఎం-10 కణాలు 109 పాయింట్లగా ఉన్నది. రెండో స్థానంలో జూపార్క్ ప్రాంతంలో పీఎం-2.5 కణాలు 182, పీఎం-10 కణాలు 155 పాయింట్లకు చేరుకున్నాయి. ఆ తర్వాత స్థానంలో పారిశ్రామిక ప్రాంతమైన బొల్లారంలో పీఎం-2.5 కణాలు 170, పీఎం-10 కణాలు 149 పాయింట్లతో గాలి కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. ఆ తర్వాతి స్థానంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలో పీఎం-2.5 కణాలు 101కంటే పీఎం-10 కణాల స్థాయి 123 పాయింట్లతో ఎక్కువగా నమోదైంది. రాబోయే రోజుల్లో వీటి స్థాయిలు మరింత పెరిగే అవకాశం ఉందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే నగరంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్వాసకోశ వ్యాధులతో పాటు చర్మ వ్యాధులు, క్యాన్సర్ల బారినపడే ప్రమాదముంటుంది.
ప్రభుత్వ నిర్లక్ష్యం.. జనజీవనం అస్తవ్యస్తం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్ల నుంచి గ్రేటర్ హైదరాబాద్‌ను పూర్తిగా గాలికొదిలేసింది. ట్రాఫిక్ అదుపు తప్పింది. నగర వీధులన్నీ చెత్త, వ్యర్థాలతో దర్శనమిస్తున్నాయి. చెరువులన్నీ కాలుష్య కాసారాలుగా మారిపోయాయి. లక్షలాది కాలం చెల్లిన వాహనాలు రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతూ కాలుష్య కారకాలను తీవ్ర స్థాయిలో వదులుతున్నాయి. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం, కాలుష్య నియంత్రణ మండలి కండ్లప్పగించి చూస్తున్నాయని నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని మండిపడుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు చెత్త నిర్వహణను గాలికొదిలేశారని, దీంతో ఎక్కడ చూసినా దుర్వాసన వెదజల్లుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్ సిటీలో వాహనాల రద్దీతో పీఎం-2.5, పీఎం-10 ధూళి కణాలు విజృంభిస్తుండటంతో ఊపిరి పీల్చుకోలేని స్థితి ఏర్పడుతున్నది. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే భాగ్యనగరంలో ఢిల్లీ పరిస్థితులు ఏర్పడతాయని పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కాలుష్య కారకాల విడుదలను అరికట్టి ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించాలని డిమాండ్ చేస్తున్నారు.