నగరంలో సర్ ప్రక్రియ గందరగోళంగా మారింది. బీఎల్వోలు ఇండ్లకు వచ్చి ఫారాలు ఇవ్వకపోవడం, హెల్ప్ డెస్క్‌లు పనిచేయకపోవడంతో సిటిజన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల అవస్థలు వర్ణణాతీతం. బీఎల్వోలు ఫారాలు ఇంటికి తెచ్చి ఇవ్వకుండా.. ఫోన్లు చేసి ఫలానా ప్లేస్‌కి తీసుకోవాలని చెబుతుండటంతో దివ్యాంగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైకల్యం కారణంగా బీఎల్వో లు చెప్పే ప్రాంతాలకు వెళ్లలేకపోవడానికి తోడు, ఫారాలు ఎలా నింపాలో తెలియక హెల్ప్ డెస్క్‌కు వెళ్దామంటే.. అక్కడ ఎవరూ ఉండకపోవడంతో అవస్థలు పడుతున్నారు. అధికారులు తమకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు.
సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ): సర్ ప్రక్రియలోని సమస్యలతో నగర ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్యుమరేషన్ పత్రాలు అందక కొందరు.. ఎలా నింపాలో తెలియక మరికొందరు.. సమస్యలుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇంకొందరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు, ప్రభుత్వం మాత్రం సర్ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు లేవని గొప్పలు చెప్పుకోవడం గమనార్హం. సర్ ప్రక్రియలో ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వారి కోసం ఎన్నికల కమిషన్, మున్సిపల్ విభాగం ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బీఎల్వోలు ఇండ్లకు రాకపోవడంతో ఎక్కడి నుంచి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్నారో తెలుసుకునేందుకు అవస్థలు పడుతున్నారు. ఇండ్ల నుంచి బీఎల్వోలు ఉన్న ప్రాంతాలకు వెళ్లి ఫారాలు తెచ్చుకోవాలంటే దివ్యాంగులు తీవ్ర ప్రయాసలు పడుతున్నారు. హెల్ప్ డెస్క్‌ల వద్దకైనా వెళ్లి తమ ఫారాలను నింపుకొందామంటే.. అవి ఎక్కడా సక్రమంగా పనిచేయడం లేదని వాపోతున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేకంగా బీఎల్వోలు ఇండ్లకు వచ్చి.. వారిచ్చే వివరాల మేరకు సర్ పత్రాలను నింపేందుకు సహాయం చేయాలని కోరుతున్నారు.
నా తీసుకపోవట్లే!
నేను కొండాపూర్‌లోని శ్రీరామ్‌నగర్‌లో ఉంటా. ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వడానికి మా ఇంటికి ఇప్పటిదాకా ఎవరూ రాలేదు. నాకు ఫోన్‌చేసి వాళ్లు చెప్పిన దగ్గరికే వచ్చి ఫారాలు తీసుకెళ్లాలని చెప్తున్నారు. నా వయస్సు 75 సంవత్సరాలు. నాకు చదువు రాదు.. నేను ఎక్కడికి వెళ్లగలను? మా తండ్రికి సంబంధించిన వివరాలు అడుగుతున్నారు. ఆయన అప్పుడు ఎక్కడ ఓటేశారో నాకు ఎలా గుర్తుంటుంది? అధికారుల పరిస్థితి చూస్తుంటే 50 ఏండ్ల నుంచి ఉన్న నా ఓటు హక్కును కోల్పోతానేమో అనిపిస్తున్నది. అధికారులు ఇళ్లకు వచ్చి వివరాలు సేకరిస్తే బాగుంటుంది.
– పుట్టా దుర్గాప్రసాద్, కొండాపూర్
ప్రత్యేక వసతులు కల్పించాలి
సర్ ప్రక్రియ అంతా గందరగోళంగా ఉంది. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. బీఎల్వోలు ఇండ్లకు రావడం లేదు. హెల్ప్ డెస్క్‌కు వెళ్దామంటే మాలాంటి వాళ్లకు సాధ్యం కాదు. ఎన్నికల కమిషన్ మాకోసం ప్రత్యేక వసతులు కల్పించి, వాళ్లే ఇక్కడికి వచ్చి ఫారాలు నింపుకొని వెళ్లాలి. దివ్యాంగుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దని కోరుతున్నాం. మరో 13 రోజులే గడువు ఉండటంతో దివ్యాంగులందరూ ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం స్పందించి మా ఇండ్లకే వచ్చి ఫారాలు నింపి తీసుకెళ్లాలి.
– ఓ దివ్యాంగుడు, యూసుఫ్‌గూడ