సుల్తాన్‌బజార్, అక్టోబర్ 5: వైద్యులు సమాజానికి వెన్నెముక వంటి వారని, పేద రోగులకు మానవత్వంతో సేవలు అందించడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. ఆదివారం కోఠిలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ భవనంలో నెలకొల్పిన బ్లడ్ బ్యాంకును ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభావేదికపై ఈనెల 10న నిర్వహిస్తున్న మానసిక రోగుల ఆరోగ్య శిబిరం సదస్సు వాల్‌పోస్టర్‌ను అతిథులతో కలిసి గవర్నర్ ఆవిష్కరించారు.
డాక్టర్ బీసీ రాయ్‌ని స్ఫూర్తిగా తీసుకోవాలి..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా రెడ్‌క్రాస్ సొసైటీ పేద రోగులకు అందిస్తున్న సేవలను అభినందించారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ బీసీ రాయ్‌ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని పేద రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని అన్నారు. ఈ సంధర్భంగా ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ భానుశాలి బ్లడ్ బ్యాంక్ అ భివృద్ధి నిమిత్తం 10 లక్షల రూపాయల చెక్కును గవర్నర్ చేతుల మీదుగా ఐఎంఏ తెలంగాణ ప్రతినిధులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా వైధ్యాధికారి డాక్టర్ వెంకటి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ దువ్వూరి ద్వారకనాథ్ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ వి అశోక్, కోశాధికారి డాక్టర్ టీ దయాల్ సింగ్,ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ కిషన్, ఐఎంఏ సభ్యులు డాక్టర్ కాళీ ప్రసాద్ రావు, డాక్టర్ కృష్ణారెడ్డి, డాక్టర్ పీఆర్ సాయికుమార్, డాక్టర్ గట్టు శ్రీనివాసులు, డాక్టర్ రాజేందర్ కుమార్, డాక్టర్ తపాడియా, డాక్టర్ సాయిరాం తదితరులు పాల్గొన్నారు.