Hyderabad Metro | సిటీబ్యూరో, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): ఎట్టకేలకు హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టు ప్రతిపాదనలు ఢిల్లీకి చేరాయి. ఇటీవల ప్రకటించిన 116 కి.మీ మెట్రో మార్గం కాకుండా అంతకు ముందు సిద్ధం చేసిన 76.4 కి.మీ మేర ప్రతిపాదించిన ప్రాజెక్టు వివరాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కలిసి వివరించారు.
సుమారు రూ. 24,269 కోట్ల వ్యయం అయ్యే మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రంగా అన్ని విధాలుగా మద్దతు ఇవ్వాలని కోరారు. కాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఔటర్ రింగు రోడ్డు మీదుగా కొంగరకలాన్ ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్ నుంచి ఫోర్త్ సిటీ(ప్యూచర్ సిటీ) వరకు ప్రతిపాదించిన 40 కి.మీ మెట్రో మార్గాన్ని ప్రస్తావించకుండానే రెండో దశ మెట్రోకు అవసరమైన నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రిని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టు వివరాలను వివరించారు.
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో పాటు హైదరాబాద్ మెట్రో రైలు అధికారులతో కలిసి కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. కాగా ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న 76.4 కిమీ మార్గాలకు సంబంధించిన డీపీఆర్‌ను సిద్ధం చేసిన హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినట్లు సమాచారం.
ఈ వివరాలతోనే కేంద్ర మంత్రిని కలిసి అనుమతులతో పాటు నిధులు సమకూర్చాలని కోరారు.అదేవిధంగా డీపీఆర్‌పై రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయాల్సి ఉందని, అప్పటి వరకు ఆలస్యం చేయకుండా కేంద్రంతో రెండోదశపై సంప్రదింపులు చేయాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారులను తీసుకువెళ్లారు.
కేంద్ర,రాష్ర్టాల భాగస్వామ్యంతో..
హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టును పూర్తిగా పబ్లిక్ ప్రైవేటు పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో చేపట్టారు. తాజాగా రెండోదశ మెట్రో ప్రాజెక్టును అదే విధానంలో చేపట్టడం సాధ్యం కాదని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతోనే చేపట్టాల్సి ఉంటుందని మెట్రో అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వాటా 30 శాతం, కేంద్ర ప్రభుత్వ వాటా 18 శాతం కలిపి 48 శాతం ఉంటే, మరో 48 శాతం మేర బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాల ద్వారా నిధులను సమీకరించుకొనే అవకాశం ఉండగా, మరో 4 శాతం మాత్రం పీపీ విధానంలో చేపట్టేందుకు ఉన్న అవకాశాలను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో బ్యాంకు రుణాలు చాలా తక్కువ వడ్డీ రేటు 2శాతం లేదా 2.5 శాతం పొందే అవకాశం ఉంటుందని ఓ మెట్రో అధికారి తెలిపారు. ఇదే విధానాన్ని అమలు చేసే దిశగా ముందుకు వెళతామని, ఇక నుంచి ఎక్కువ జాప్యం లేకుండా మెట్రో రెండో దశ పనులు జరిగేలా చేస్తామనే అభిప్రాయాన్ని మెట్రో అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో కొత్తగా మెట్రో ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు వస్తున్నా, హైదరాబాద్ మాత్రం వెనుకబడి ఉంది.