మల్కాజిగిరి, డిసెంబర్ 27 : మల్కాజిగిరి ప్రాంతంలో రహదారి సమస్యలకు మోక్షం లభించనున్నది. ఏవోసీ రోడ్ల సమస్యలకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి.. అంతర్గత రోడ్లతో అనుసంధానం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. సమీక్షలు, సమావేశాలతో ప్రణాళికలు సిద్ధం చేసి, ప్రతిపాదనలతో అధికారులకు సమర్పించారు. త్వరలోనే మల్కాజిగిరి ప్రాంతం రోడ్డు సమస్యలకు శాశ్వత పరిష్కరం చూపనున్నది. ఏవోసీ రోడ్ల ద్వారా సైనిక్‌పురి, ఆర్కే పురం, మల్కాజిగిరి, సఫిల్‌గూడ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్‌కు, ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్న విషయం గుర్తించిన ఎమ్మెల్యే.. రహదారుల సమస్యలపై పోరాటం చేశారు.
సమస్యల పరిష్కారానికి ప్రణాళికతో ముందుకుసాగారు. ఆర్మీ ఆర్డినెన్స్ సర్కిల్(ఏవోసీ) రహదారుల నుంచి సికింద్రాబాద్ వెళ్లే సమయంలో ఈస్ట్ మారేడ్‌పల్లి ఏవోసీ గేటును పలు సమయంలో మూసివేసే వారు. దీంతో 5 కి.మీ. తిరిగి వెళ్లాల్సి వచ్చేది. వీటిపై ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించారు. సమస్య పరిష్కారం కోసం సీఎంను కలిశారు. ప్రభుత్వం స్పందించి, సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టింది. ఏవోసీ నుంచి 6 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించనున్నది. రూ.960 కోట్లతో పనులు చేపట్టేందుకు రక్షణ శాఖ, బల్దియా నడుమ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తున్నది. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు చేపట్టనున్నారు. దీంతో మల్కాజిగిరి, అల్వాల్, తదితర సమీప ప్రాంతాలకు ప్రధాన సమస్యలకు మోక్షం లభించనున్నది.
ప్రజా రవాణా, సౌకర్యాలకు చేయూత
ఏవోసీ అదనపు రోడ్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజా రవాణా సులభతరం అవుతుందని, సౌకర్యాల కల్పన చేపట్టవచ్చని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి రోడ్లు ఏర్పాటుపై పోరాటం చేస్తున్నారు. మల్కాజిగిరి ప్రాంతాన్ని ట్రాఫిక్ ఫ్రీ ప్రాంతంగా తీర్చిదిద్ది సమస్యలు లేకుండా సాఫీగా సాగేలా చర్యలు చేపట్టారు. ఏఓసీ రోడ్లను కాలనీలతో అనుసంధానం చేసేలా ప్రణాళికతో ముందుకుసాగుతున్నారు. అధికారులతో కలిసి గౌతంనగర్ డివిజన్లోని ఉత్తంనగర్ ఆర్యూబీ నుంచి ఐఎన్నగర్ బీహార్బస్తీ వరకు సర్వీస్ రోడ్డు ఏర్పాటుపై సమగ్ర పరిశీలన చేపట్టారు. వీటికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
అధికారులతో సమన్వయం చేస్తూ..
సమస్యలను అధికారులకు తెలియజేస్తూ, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ.. రోడ్డు నిర్మాణం ద్వారా కలుగుతున్న ప్రయోజనాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి బల్దియా కమిషనర్ కర్ణన్‌ను కలిసి వివరించారు. ఆర్కే పురం బ్రిడ్జి వద్ద సమస్యలను పరిశీలించారు. ఆర్కే పురం ైఫైఓవర్ నిర్మాణాన్ని ఆర్కే పురం ఆర్మీ స్కూల్ నుంచి మిలిటరీ హాస్పిటల్ సమీపం వరకు ఆర్మీ భూమిలో రోడ్డు వెడల్పు చేసి పొడగించే అంశంపై సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. ైఫ్లై ఓవర్ నిర్మాణంలో భాగంగా ఇండ్లు కోల్పోయే నిర్వాసితులను కలిసి, ఇండ్లు కోల్పోయిన వారికి తగిన న్యాయమైన పరిహారం అందేలా పూర్తిస్థాయిలో కృషిచేస్తామని భరోసా కల్పించారు.
కాలనీలకు రహదారి అప్రోచ్ రోడ్డుపై ప్రణాళిక
మల్కాజిగిరి ప్రాంతం త్వరలోనే రోడ్ల సమస్యలకు మోక్షం లభించనున్నది. విశాలమైన రోడ్లు, ఏవోసీ ప్రాంతంలో సమస్యలు లేకుండా సాఫీగా రవాణా సాగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ప్రతిపాదనలు సిద్ధం చేసేలా పలు దఫాలుగా అధికారులతో చర్చించారు. శాశ్వత పరిష్కారం కోసం డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నారు. మల్కాజిగిరి ప్రాంతంలో ఎలాంటి రోడ్ల సమస్యలు లేకుండా చర్యలు చేపట్టారు. త్వరలోనే రోడ్డు సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనున్నది.
ఏవోసీ రహదారుల సమస్యలు పరిష్కరిస్తాం
మల్కాజిగిరి ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి రోడ్డు సమస్యలు ఉన్నాయి. సరైన అప్రోచ్ రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీటికి శాశ్వత పరిష్కార చర్యల కోసం కృషిచేస్తున్నాం. సమస్యలపై పలుమార్లు అసెంబ్లీలో చర్చించాను. సీఎం దృష్టికి, ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాను. సమస్యలలో కొన్నింటికీ పరిష్కారం లభించింది. మరికొన్నింటిపై ప్రత్యేక దృష్టిసారించాం. ఏవోసీ రోడ్లతో కాలనీల రోడ్లును అనుసంధానించడం, ఇందిరానెహ్రూనగర్‌లో రోడ్డు సమస్యలు లేకుండా చూస్తాం. త్వరలోనే వీటికి మోక్షం లభిస్తుంది.
– మర్రి రాజశేఖర్‌రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే