సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): విద్యకు, ఉపాధికి, ఇల్లు, ఇంటి స్థలానికి సంబంధించి మనకు హక్కులను కల్పించి సాక్ష్యాలుగా నిలిచే చట్టబద్ధమైన డాక్యుమెంట్లు అత్యంత ప్రాధాన్యం. అటువంటి పత్రాల్లో ఏవైనా అనుకోకుండా కనబడకుండా పోతే అప్పుడు మన పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది. అటువంటి అయోమయ స్థితి నుంచి ఊరట కలిగించి పోగొట్టుకున్న పత్రాల స్థానంలో కొత్త ధ్రువ పత్రాలను అందించే ప్రక్రియలో కీలకమైన భాగమే ‘నాన్ట్రేసబుల్ సర్టిఫికేట్’. ఫిర్యాదుదారుడు ఇచ్చిన దరఖాస్తు మేరకు సంబంధిత పత్రాలను వెతికేందుకు పోలీసులు ప్రయత్నిస్తారు. నెలరోజులైనా దొరక్కపోతే… ఆ ధ్రువపత్రం లేదా డాక్యుమెంట్ దొరకలేదంటూ పోలీసు విభాగం ‘నాన్ట్రేసబుల్ సర్టిఫికేట్(ఎన్టీసీ)’ అందిస్తుంది. ఇప్పుడు అదే ఎన్టీసీ (ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు) మహానగరంలోని పలు పోలీస్స్టేషన్లలో అధికారులకు కాసులు కురిపిస్తున్నది.
అత్యవసరమా.. అయితే రేటెక్కువే
నాన్ట్రేసబుల్ సర్టిఫికేట్ కోసం ఫిర్యాదు దారు పడే తపన, అతని అవసరాన్ని బట్టి పోలీసు అధికారులు ఎంత లంచం తీసుకోవాలో నిర్ణయిస్తున్నారు. ఎన్టీసీ ఇచ్చే విషయంలో గతంలో కంటే ఇప్పుడు నిబంధనలు కఠినతరంగా మారడం కూడా అదనపు వసూళ్లను నిర్ణయిస్తున్నది. ఫిర్యాదు దారు ఎన్నారై అయి ఉంటే అందులోనూ అతనికి అత్యవసరమైతే లంచం ధర పెరిగిపోతూ ఉంటుంది. ఆస్తికి సంబంధించిన పత్రాలు పోయినా, లేదా దొంగతనం జరిగినా వెంటనే దగ్గర్లోని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్(ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) లేదా ఎన్సీఆర్ (నాన్ కాగ్నిజబుల్ రిపోర్ట్)ను ఫైల్ చేయాలి.
అందుకు సంబంధించిన ఒక కాపీని భద్రపరుచుకోవాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఫిర్యాదుదారుడు ఇచ్చిన వివరాల మేరకు పోలీసులు ఆ పత్రాలను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తారు. పత్రాలు లభించకపోతే నెలరోజుల సమయం తర్వాత నాన్ట్రేసబుల్ సర్టిఫికెట్ ఇస్తారు. ఎన్టీసీ వాస్తవంగా జరిగిన నష్టాన్ని తెలుపుతుంది. డూప్లికేట్ ఆస్తి పత్రాలను పొందడానికి కావలసిన కీలకపత్రమిది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత దీనికి సంబంధించిన నోటీసును కనీసం రెండు పత్రికల్లో వచ్చేట్లు చూసుకోవాలి. నాన్ట్రేసబుల్ సర్టిఫికెట్ అనేది రిజిస్టేష్రన్ పత్రాలు డూప్లికేట్వి తీసుకోవడంలో చాలా ముఖ్యమైనవి కావడంతో పోలీస్స్టేషన్లలో మొదట్లో చాలా వరకు విమర్శలు వచ్చేవి. ఆ తర్వాత ఎన్టీసీని ఇవ్వడం కఠినతరం చేసిన తర్వాత ఆ సర్టిఫికెట్ డిమాండ్ చాలాపెరిగింది.
ఆ జోన్లో ఎన్టీసీలు ఎక్కువే
నగరంలోని ఓ జోన్లోని పోలీస్స్టేషన్ లో నెలకు 10 నుంచి 15 వరకు డాక్యుమెంట్స్ పోయాయంటూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఇందులోనూ రిజిస్టేష్రన్ డాక్యుమెంట్స్ మిస్ అయినట్లుగా వచ్చే ఫిర్యాదులే ఎక్కువ. వీటికి సంబంధించినంతవరకు ఎఫ్ఐఆర్లు చేయడం, తర్వాత నాన్ట్రేసబుల్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతున్నది. గతంలో ఇదే పోలీస్స్టేషన్లో పనిచేసిన సీఐ ఎంత పెద్ద పైరవీ వచ్చినా ఎన్టీసీ ఇవ్వకపోయేవారని ప్రస్తుతం పనిచేస్తున్న పోలీసులు చెప్పారు. అయితే ఆ తర్వాత వచ్చిన సీఐ మాత్రం తనకు ఉన్నతాధికారులతో ఉన్న సాన్నిహిత్యంతో పేపర్ ప్రకటన తర్వాత పూర్తిగా పకడ్బందీగా పనిచేసి ఆ తర్వాత నాన్ట్రేసబుల్ ఇస్తున్నారు.
ఇందుకోసం ఫిర్యాదుదారుల అవసరాన్ని బట్టి 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అయితే మిగతా జోన్లలోని పోలీస్ స్టేషన్లలో కూడా ఇలాగే రహస్యంగా దందా జరుగుతున్నదని తెలుస్తున్నదిత. ఇటీవల నగరశివారులోని ఓ ప్రాంతంలో ఇచ్చిన నాన్ట్రేసబుల్ సర్టిఫికెట్ వ్యవహారం ఆస్తులకు సంబంధించిన గొడవలో కీలకంగా మారడంతో సదరు సీఐకి మెమో ఇచ్చారు. ఆ తర్వాతకూడా రెండు మూడు ఘటనలు జరిగాయి. దీంతో పోలీసులు ఒకవైపు జాగ్రత్తపడుతూనే మరోవైపు హైరిస్క్ అంటూ ధర పెంచడం గమనార్హం.