Hyderabad Metro | సిటీబ్యూరో, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ) : నగరంలో మెట్రో రైలుకు అదనపు బోగీల ఏర్పాటు కలగానే మిగిలిపోయేలా ఉంది. ఏడాదిన్నర కిందటే.. కొత్త కోచ్‌లతో నగరవాసులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తామంటూ ప్రభుత్వ పెద్దలు, మెట్రో నిర్వహణ సంస్థ కూడా వెల్లడించింది. కానీ ఇప్పటికీ ఆ దిశగా ఒక్క అడుగూ పడలేదు. కనీసం కొనుగోలు ఒప్పందాలు కూడా పూర్తి కాలేదు. గతంలో పుణెలోని ఓ మెట్రో కోచ్ ఫ్యాక్టరీ నుంచి అదనపు బోగీలను లీజుకు తీసుకోవాలని భావించారు. కానీ ఆ అంశంలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో.. ఏడాదిన్నర కాలంగా మగ్గుతూనే ఉంది. నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉండే మార్గాల్లో కొత్త కోచ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలున్నాయి. ట్రిప్పుల సంఖ్య, బోగీల సంఖ్యను పెంచాలనే ప్రతిపాదనలను ప్రభుత్వం ఇప్పటికీ పట్టించుకోలేదు.
ప్రస్తుతం 1075 ట్రిప్పుల ద్వారా..
ప్రస్తుతం 1075 ట్రిప్పుల ద్వారా హైదరాబాద్ మెట్రో.. రవాణా సదుపాయాలు అందిస్తోంది. చాలీచాలనీ బోగీలతోనే గడిచిన ఐదారేండ్లుగా నెట్టుకొస్తున్నది. ముఖ్యంగా పీక్ అవర్స్‌లో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిపోతున్నాయి. అయినా అవే మూడు బోగీలతో లెక్కకు మించిన ప్రయాణికులతో లాక్కోస్తున్నారు. కనీసం రద్దీ ఎక్కువగా ఉండే సమయంలోనైనా అదనపు బోగీలను ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులకు తోపులాట మధ్యే రాకపోకలు సాగిస్తున్నారు. నాగోల్ – రాయదుర్గం మార్గంలోనైతే నిమిషాల వ్యవధిలో సర్వీసులు వచ్చిన ఫ్లాట్‌ఫారం మీద రద్దీ తగ్గడం లేదు.
Hyd10
ప్రతిపాదనలు సిద్ధం చేసి..
మూడు బోగీలు ఉండే 10 కొత్త మెట్రో ట్రైన్లను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి.. ఏడాదిన్నర గడిచిపోయింది. ఇప్పటికే ఓ సారి ఉత్పత్తి సంస్థలను గుర్తించి సంప్రదింపులు చేశారు. ప్రస్తుతం 57 హ్యుందాయ్ రోటెమ్ త్రీ కోచ్‌లతో కూడిన రైళ్ల ఉత్పత్తి తగ్గింది. ఈ క్రమంలో కొత్త డిజైన్ల ఎంపికపై దృష్టి పెట్టారు. అయితే ఇందుకు పుణె, నాగ్‌పూర్ మెట్రో సంస్థలను ఆశ్రయించారు. అయితే ఆయా సంస్థల వద్ద చాలనన్నీ అదనపు కోచ్‌లు లేవని తెలిసింది. ఈ క్రమంలోనే కొత్త డిజైన్లతో కూడిన ట్రైన్ల కోసం బెంగళూరు కోచ్ ఫ్యాక్టరీలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం సహకరిస్తే… 10 ట్రైన్లను తీసుకు వస్తామంటూ.. మెట్రో అధికారులు చెబుతున్నారు.
నిత్యం 5 లక్షల మంది..
ప్రస్తుతం నిత్యం 5 లక్షల మందిని మెట్రో సంస్థ గమ్యస్థానాలకు చేర్చుతోంది. టైం ఫ్రీక్వెన్సీని సర్దుబాటు చేయగలిగితే… ప్రయాణికుల సంఖ్యను 7 లక్షలకు పెంచే వీలుందని తెలిసింది. 10 లక్షల మంది ప్రయాణించేందుకు మరో 10 కోచ్‌లు ఉంటే తప్ప.. సాధ్యం కాదు. కొత్త మార్గాల్లో కొత్త ట్రైన్లతో పది లక్షల ప్రయాణికుల మార్క్‌ను దాటే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ఉన్న రైడర్ షిప్ కూడా పూర్తి సామర్థ్యానికి కంటే 10 శాతమే తక్కువ ఉందని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. కొత్త కోచ్‌ల డిజైన్లు ఖరారు చేసేందుకు ఆరు నెలలు పడుతుందంటున్నారు. ఏడాదిన్నర తర్వాతే కొత్త ట్రైన్లు అందుబాటులోకి వస్తాయంటున్నారు. అప్పటి వరకు అరకొర బోగీల నడుమ ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవలు అందిస్తామని చెబుతున్నారు.