ఎల్బీనగర్, మార్చి 5: ఎల్బీనగర్ జోన్ పరిధిలో ఆస్తిపన్నుల వసూళ్ల పక్రియను వేగవంతం చేశారు. ఎల్బీనగర్ జోన్ వ్యాప్తంగా రూ. 262 కోట్ల లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఫిబ్రవరి మాసం చివరి వరకు రూ. 225.38 కోట్లను వసూళ్లు చేయగా మార్చి మాసం నాలుగు రోజుల్లో రూ. 64 లక్షలు వసూలు చేశారు. మిగిలిన బకాయిలు రూ 36.63 కోట్లను మార్చి చివరి నాటికి వసూలు చేసేందుకు రోజువారీగా టార్గెట్లు ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్నారు. ఎల్బీనగర్ జోన్ పరిధిలోని కాప్రా, ఉప్పల్, హయత్నగర్, ఎల్బీనగర్, సరూర్నగర్ సర్కిళ్ల పరిధిలో ప్రత్యేక డ్రైవ్లను చేస్తూ ఆస్తిపన్ను వసూళ్లను చేపడుతున్నారు. వందశాతం పన్ను వసూళ్లు చేసేందుకు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ నేతృత్వంలో ఐదు సర్కిళ్ల ఉప కమిషనర్లతో పాటుగా రెవెన్యూ విభాగం అధికారులు పనిచేస్తున్నారు. ఎల్బీనగర్ జోన్ పరిధిలోని కాప్రా సర్కిల్లో ఆస్తి పన్ను వసూళ్ల టార్గెట్ రూ. 52 కోట్లు కాగా ఫిబ్రవరి నెల చివరి వరకు రూ. 47.93 కోట్లను వసూలు చేశారు. మార్చి మాసం నాలుగు రోజుల్లో రూ. 8 లక్షల బకాయిలు వసూలు చేశారు. ప్రస్తుతం మరో రూ. 3.99 కోట్ల బకాయిలు ఉన్నాయి.
ఎల్బీనగర్ జోన్లోని ఉప్పల్ సర్కిల్లో ఆస్తిపన్ను వసూళ్ల టార్గెట్ రూ. 37 కోట్లు కాగా ఫిబ్రవరి మాసాంతం వరకు సర్కిల్ అధికారులు రూ. 29.02 కోట్లు వసూలు చేశారు. మార్చి మాసం నాలుగు రోజుల్లో రూ.9 లక్షలు వసూలు చేశారు. మిగిలిన బాకాయిలు రూ. 7.89 కోట్లను మార్చి మాసం చివరి నాటికి వసూలు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. హయత్నగర్ సర్కిల్లో ఆస్తిపన్ను వసూళ్ల టార్గెట్ రూ. 62 కోట్లు కాగా ఫిబ్రవరి మాసాంతం వరకు రూ.52.80 కోట్లు వసూలు చేశారు. మార్చి మాసం నాలుగు రోజుల్లో రూ. 18 లక్షలను వసూలు చేయగా మిగిలిన బకాయిలు రూ. 9.02 కోట్లను మార్చి మాసాంతం వరకు వసూళ్లు చేయాలన్న లక్ష్యంతో రోజువారీగా టార్గెట్లు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు.
ఎల్బీనగర్ సర్కిల్లో ఆస్తిపన్ను వసూళ్ల బకాయిలు రూ. 49 కోట్లు కాగా ఫిబ్రవరి మాసం చివరి వరకు రూ. 45.18 కోట్లు చేశారు. మార్చి మాసం నాలుగు రోజుల్లో రూ. 14 లక్షలు వసూళ్లు కాగా మిగిలిన బకాయిలు రూ. 3.68 కోట్లను మార్చి మాసాంతం వరకు వసూళ్లు చేసేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. సరూర్నగర్ సర్కిల్లో ఆస్తిపన్ను వసూళ్ల టార్గెట్ను రూ. 62 కోట్లు ఉండగా ఫిబ్రవరి మాసం వరకు రూ. 49.80 కోట్లు వసూలయ్యాయి. మార్చి మాసం నాలుగు రోజుల్లో రూ. 14 లక్షలు వసూలు చేశారు. మిగిలిన బకాయిలు రూ. 12.06 కోట్లను మార్చి చివరినాటికి వసూలు చేసేందుకు రోజువారీగా టార్గెట్లు పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు.