జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో నెలకొన్న సమస్యలు బల్దియా అధికారులకు సవాల్‌గా మారుతున్నది. శానిటేషన్, రోడ్లు, వీధి నిర్వహణ, నిర్మాణ రంగ అనుమతులకు తోడు తాజాగా ఆస్తిపన్ను లెక్కింపుపై గందరగోళం నెలకొంది. విలీనమైన 27 పురపాలికల పరిధిలోని ప్రాపర్టీల వివరాలను సీజీజీ (సెంట్రల్ గుడ్ గవర్నెన్స్) ద్వారా జీహెచ్ఎంసీ రికార్డుల్లోకి బదలాయించారు. ఈ నేపథ్యంలోనే ఆస్తిపన్ను లెక్కింపుపై అధికారులు స్పష్టత రాకపోవడంతో అటు ప్రజల్లో, ఇటు అధికారుల్లో అయోమయం పరిస్థితులు నెలకొన్నాయి. ఆస్తిపన్ను లెక్కింపులో రెండు విధానాలు ఉండడమే ఇందుకు కారణమైంది.
– సిటీబ్యూరో, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ )

వాస్తవంగా జీహెచ్ఎంసీ పరిధిలో రెంటల్ వాల్యూ ఆధారంగా ప్రాపర్టీ టాక్స్ వసూలు చేస్తున్నారు. 27 పురపాలికల్లో మాత్రం క్యాపిటల్ వాల్యూ (సబ్ రిజిస్ట్రార్ రేటు) ఆధారంగా ప్రాపర్టీ టాక్స్ వసూలు చేస్తున్నారు. అయితే జీహెచ్ఎంసీలో 27 పురపాలికలు విలీనం చేయడంతో ఒకే ప్రాంతంలో రెండు రకాల ప్రాపర్టీ వసూలు చేయడంపై నగరవాసుల్లో అయోమయం నెలకొన్నది. జీహెచ్ఎంసీ పరిధిలో 19.49 లక్షల ప్రాపర్టీలు ఉన్నాయి. వీటిలో రెసిడెన్షియల్ 16.35 లక్షలు, నాన్ రెసిడెన్షియల్ 2.80 లక్షలు, మిక్ట్స్ 34వేలు ఉన్నాయి.
గతేడాదిలో రూ.2038.42 కోట్ల ఆస్తిపన్ను వసూలైంది. ఈ సారి ఆర్థిక సంవత్సరం (2025-26) ఆస్తిపన్ను రూ.2500 కోట్లు వసూలు చేయాలని బల్దియా లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే ప్రస్తుతం రూ.1500 కోట్లకు పైగా ఆస్తిపన్ను వసూలు చేసింది. విలీనంతో మరింత ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. అయితే ప్రస్తుతం అమలవుతున్న రెండు విధానాలనే కొనసాగిస్తారా? లేదంటే మార్పులు చేస్తారా? అన్న అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. సీడీఎంఏ పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో వసూలయ్యే ప్రాపర్టీ టాక్స్‌కు సమానంగా 27 మున్సిపాలిటీల్లో వసూలు చేస్తారా? లేదంటే జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం వసూలు చేసి ప్రజలపై భారం మోపుతారా? అన్నది వేచి చూడాల్సిందే.
ఇదే అదనుగా ఆక్రమణల జోరు
కుత్బుల్లాపూర్: మున్సిపాలిటీలన్నీ జీహెచ్ఎంసీలో విలీనమైన విషయం తెలిసిందే. అధికారులు ఒకవైపు విలీనం అంశాలను చక్కదిద్దే క్రమంలో ఉన్న క్రమంలో మరో వైపు ‘సందట్లో సడేమియా’లా అక్రమ నిర్మాణదారుల పనులు మరింత వేగవంతం చేసుకుంటున్నారు. కొంపల్లి జీహెచ్ఎంసీ పరిధిలో దూలపల్లి, కొంపల్లి, జయభేరి, అపర్ణఫాంగ్రో, శ్రీనివాస్‌నగర్ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణదారులు తమ నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేసుకునేలా రేయింబవళ్లు పాట్లు పడుతున్నారు.
ఈ అక్రమ నిర్మాణాల వెనక అధికారులే అండగా నిలుస్తున్నారని బహిరంగ చర్చసాగుతున్నది. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదని వచ్చే ఫిర్యాదులుంటే.. జీహెచ్ఎంసీ లో విలీనం పనులతో బిజీగా ఉన్నామంటూ సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఒకవైపు అయితే.. ఇదే సమయం అనుకూలంగా ఉండడంతో అక్రమ నిర్మాణదారులకు వంతపాడుతున్నారని బహిరంగంగా చర్చనడుస్తున్నది. కొంపల్లిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై అనేక ఫిర్యాదులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. కొద్ది రోజులు పనులను నిలిపివేసిన దాఖాలాలు ఉండే. కానీ ఇప్పుడు నిలిపివేసిన అక్రమ నిర్మాణాలు యధేచ్ఛగా కొనసాగించడం పలు విమర్శలకు తావిస్తున్నది. కొంపల్లిలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.