ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరైన సందర్భంగా శుక్రవారం పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌ను అష్టదిగ్బంధం చేశారు.ఎటుచూసినా పోలీసులే కనిపించారు. సీఎం రాక సందర్భంగా నిరుద్యోగులు నిరసనలు, ర్యాలీలు చేసే అవకాశమున్నట్లు సమాచారం రావడంతో ఉదయమే పలువురిని అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్లకు తరలించారు. మరోవైపు రోడ్లన్నీ బంద్ చేశారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డు ప్రాంతంలో సీఎం అర గంట ప్రైవేటు కార్యక్రమానికి ఆరేడు గంటల పోలీసుల హడావుడి ప్రజలను చికాకు పెట్టింది.
-సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, జనవరి 9(నమస్తే తెలంగాణ): నారాయణగూడ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్.. అశోక్ నగర్ వరకు అడుగడుగునా పోలీసులే.. ఎటుచూసినా రక్షణ వలయమే.. అరగంట కార్యక్రమానికి ఆరేడుగంటల హడావిడి.. వెయ్యిమంది పోలీసులు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ ప్రాంతమంతా దిగ్బంధించారు. శుక్రవారం మధ్యాహ్నం 12గంటల తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి ఓ ప్రైవేటు మాల్ ప్రారంభోత్సవానికి వస్తుండడంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్డు ప్రాంతంలో ట్రాఫిక్ పరిస్థితి పూర్తిగా అగమ్యగోచరమైంది.
ఒకవైపు రాజాసాబ్ సినిమా ప్రదర్శనకు సంబంధించిన హడావిడి, మరోవైపు సీఎం రేవంత్ చేతుల మీదుగా ఓ కమర్షియల్ సినిమా కాంప్లెక్స్ ప్రారంభోత్సవం.. ఈ రెండు కీలక కార్యక్రమాల మధ్య ఆర్టీసీ క్రాస్ రోడ్డు పరిసరాల్లో రోడ్లన్నీ బంద్ చేయడంతో అన్ని వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
క్రాస్‌రోడ్స్ వద్ద ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో రేవంత్‌రెడ్డి పాల్గొన్న నేపథ్యంలో అశోక్‌నగర్‌లోని నిరుద్యోగులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. నిరుద్యోగులు నిరసనలు, ర్యాలీలు చేసే అవకాశమున్నట్లుగా సమాచారం రావడంతో ఆ పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్రోడ్సు, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో నిరుద్యోగులను పోలీసులు నిర్బంధించారు.
సుమారు వేయి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారంటే చాలా హాస్యాస్పదంగా కనిపించింది. ఉదయం ఏడుగంటల నుంచే పోలీసులు ఓడియన్ పరిసర ప్రాంతాలకు చేరుకోవడంతో అక్కడ మొత్తం హంగామా కనిపించింది. హఠాత్తుగా ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి వాహనదారులకు చుక్కలు చూపించారు.