Robbery | బంజారాహిల్స్, మే 20: జూబ్లీహిల్స్‌లోని ఓ డాక్టర్ ఇంటిలోకి పట్టపగలే ప్రవేశించి.. భారీ చోరీకి పాల్పడిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. డీఐ మధుసూదన్ కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నం. 52లోని హెచ్ఎంటీవీ ఆఫీసుకు ఎదురుగా ఉన్న ఫ్లాట్ నం.1061లో డాక్టర్ అశోక్‌కుమార్ అలీం చందానీ ఉంటున్నారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో రోజూ ఉదయం తాళం వేసి, రాత్రి ఇంటికి వస్తున్నారు. ఈ నెల 17న ఇంటికి వచ్చి చూడగా.. అల్మారాలో నుంచి రూ.25 లక్షల నగదు, రెండు తులాల బంగారం, 50 గ్రాముల వెండి కాయిన్ చోరీకి గురైంది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు చోరీకి పాల్పడిన వ్యక్తిని గుర్తించారు. నారాయణపేట జిల్లా ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన శివకుమార్(20) ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించి, అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. ఎనిమిది నెలల కిందట కారును కొనుగోలు చేసిన శివకుమార్.. గత నెల 24 నుంచి ఈ నెల 8 వరకు జూబ్లీహిల్స్ రోడ్ నం.52లోని హెచ్ఎంటీవీలో కారును ఎంగేజ్‌కు పెట్టాడు.
ఆఫీసు వద్ద ఉన్న సమయంలో ఎదురుగా ఉన్న 1061 ఫ్లాట్ నంబర్లో డాక్టర్ అశోక్‌కుమార్ ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి, చోరీ చేసేందుకు రెక్కీ నిర్వహించాడు. రోజంతా డాక్టర్ ఇంట్లో ఎవరూ ఉండరని గుర్తించిన శివకుమార్.. ఈ నెల 17న పక్కంటి ప్రహరీ పైనుంచి లోనికి ప్రవేశించాడు. టెర్రస్ మీదుగా వెళ్లి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. కాగా, చోరీ సొత్తులో నుంచి కొంత డబ్బును ఖర్చు చేసిన శివకుమార్.. కారులో సొంతూరైన నారాయణపేటకు వెళ్తున్నట్లు గుర్తించిన జూబ్లీహిల్స్ పోలీసులు సినీ ఫక్కీలో అతడి వాహనాన్ని చేజ్ చేశారు. నారాయణపేటకు చేరుకోగానే అక్కడి పోలీసుల సహకారంతో రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.23.70 లక్షల నగదుతో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. సోమవారం రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై గతంలో కూడా మాదాపూర్ పీఎస్‌లో రెండు కేసులు ఉన్నాయని, జైలుకు కూడా వెళ్లివచ్చాడని తేలింది.