ఉపవాస దీక్షను విరమించిన భక్తులు
ఘనంగా మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం
కీసర,మార్చి 2: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం కీసరగుట్ట పరిసర ప్రాంతమంతా భక్తులతో సందడిగా మారింది. స్వామివారిని దర్శించుకున్న భక్తులు నేరుగా కాశీవిశ్వేరాలయంలోని శివుడుని దర్శించుకున్నారు. అక్కడి నుంచి నేరుగా అక్కన్న మాదన్నల ఆలయంలో ఉన్న శ్రీ లక్ష్మీనర్సింహస్వామివారిని దర్శించుకున్నారు. కలెక్టర్ హరీశ్ ఆదేశానుసారం జిల్లా యంత్రాంగం ఆర్అండ్బీ గెస్ట్‌హౌజ్‌లో ఉండి జాతర ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శానిటేషన్ విషయంలో పంచాయతీ అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. భక్తుల సౌకర్యార్థంవాసవి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం, రెడ్డిసంఘం, మార్వడీ సంఘం, వంశీరాజ్ సంఘం, మూన్నురుకాపు సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కేంద్రాల్లో భక్తులకు అన్నదానం చేశారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థులు నృత్యాలు చేసి భక్తులను పరవశింపజేశారు.
తినుబండారాల దుకాణాల్లో తనిఖీలు
కీసరగుట్ట జాతర బ్రహ్మోత్సవాల్లో కలెక్టర్ హరీశ్ ఆదేశానుసారం ప్రసాదాలు,హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల్లో ఆహార భద్రత అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్ఎస్ఓ సునీత తన సిబ్బందితో కలిసి ఆలయంలో భక్తుల కోసం తయారుచేస్తున్న లడ్డూ ప్రసాదాలను తనిఖీ చేశారు.
కీసరగుట్టలో నేడు..
కీసరగుట్టలో మహాశివరాత్రి సందర్భంగా గురువారం స్వామివారికి ఉదయం 5.30గంటలకు మహా న్యాస పూర్వక రుద్రాభిషేకం, కల్యాణ మండపంలో సామూహిక అభిషేకాలు, రాత్రి 7గంటలకు ప్రదోషకా ల పూజలు, నీరాజన, మంత్రపుష్పం, రాత్రి 8 గంటలకు వసంతోత్సవం, పుష్పయాగం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆలయ చైర్మన్ ఉమాపతిశర్మ, ఆలయకార్యనిర్వహణాధికారి సుధాకర్‌రెడ్డి తెలిపారు.